02 భాగం

 

…………………………………కథా ప్రారంభం

02

నా పేరు బుద్ధుడు. నేను జ్ఞాన భిక్షువు కాకముందు నా పూర్వ నామము సిద్ధార్థుడు. నా చరిత్ర మీకు తెలియాలంటే మీరు 2 ,550 సంవత్సరాలు అనగా క్రీ.పూ. 563 సంవత్సరం నుండి 483 మధ్య కాలము        ( 80 సం. ) దగ్గరికి రావాల్సి ఉంటుంది. మా నాన్నగారి పేరు శుద్ధోధన మహారాజు. మా అమ్మ గారి పేరు మహామాయాదేవి. మాది కపిలవస్తు నగరము.

మాది రాజవంశీయుల వంశము. మా అమ్మగారి  కడుపున నేను పడటముతో ఆమె కాస్త నిండు గర్భిణియై ... తొలికాన్పు కోసము అమ్మ పుట్టినిల్లు అయిన రామ గ్రామము చేరుకుంటున్న సమయములో పొద్దు వాలే సమయానికి మా అమ్మతో సహా వచ్చిన బృందము అంతా లుంబిని వనము ( రామ గ్రామానికి చేరువలో ఉన్న) చేరుకున్నది. ఆ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకొని మరునాడు ఉదయం రామ గ్రామము వెళ్లాలని ఈ బృందము ఆలోచన.

ఆనాడు పున్నమి. ఈ వనమంతా ఈ పండు వెన్నెల చల్లదనము పంచుతుండగా.... మా అమ్మకి అనుకోకుండా ఈ వనమునందే పురిటి నొప్పులు మొదలైనాయి. అప్పుడికే ఈ తరుణము కోసము మా అమ్మ పరిచారిక బృందము అంతా గూడ అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉండటముతో.... మా అమ్మ నవ్వుతూ... తియ్యని బాధని పంటి బిగువున అనుభవిస్తూ.... పున్నమి చంద్రుడు వంటి నన్ను ఒక కుమారుడిగా జన్మనిచ్చింది . నా చంద్ర ముఖ బింబమును చూసిన మా అమ్మకు నేను 5 వ నెల గర్భములో ఉన్నప్పుడు తను కన్న ఒక దివ్యమైన కల జ్ఞాపకము వచ్చింది.

 

*** *** *** *** *** ***



బుద్ధ పూర్ణిమ రోజు గావడంతో.....

బుద్ధ గయలో....

బౌద్ధ సన్యాసులతో... ఈ క్షేత్రము నిండిపోయినది.అలాగే ఈ క్షేత్రములో ఉన్న బుద్ధుడు ఙ్ఞానము పొందిన బోధి వృక్షము మరియు బౌద్ధ మందిరమును వివిధ రకాల పుష్పాలతో..సూక్తులతో..బోధనలతో..అలంకరించే పనిలో 1800 మంది బౌద్ధ భిక్షువులు నిమగ్నమైన వేళలో..

నిర్వాణ లామా ఈ మందిరమునకు చేరుకోవడము జరిగినది.సరాసరిగా మందిరము లోపల ఉన్న బుద్ధుడి  విగ్రహమూర్తికి నమస్కారము చేసి అక్కడే ఉన్న ఈ క్షేత్ర పరిరక్షక లామాల దగ్గర నుండి ఆశీస్సులు అందుకొని...బుద్ధ భగవానుడు ఙ్ఞానము పొందిన బోధి వృక్షము క్రిందకు చేరుకొని ధ్యానం చేసుకోవడం ఆరంభించాడు..

ఇంతలో...మరికాసేపటిలో అక్కడికి ధర్మశాల నుండి దలైలామా వస్తున్నారని...ధర్మ బోధ చేస్తారని..కాబట్టి అందరూ గూడ వారికి కేటాయించిన కుర్చీలలో ప్రశాంతముగా కూర్చోవాలని మైకులో చెప్పడము జరిగినది.

 అనుకున్న సమయానికి దలైలామా కాస్త ప్రసంగము కోసము ఏర్పరిచిన వేదిక వద్దకు రావడము ....ఈ ప్రసంగము వినడానికి అక్కడ పనిచేస్తున్న బౌద్ధ సన్యాసులు,బౌద్ధ భిక్షువులు,బౌద్ధ లామాలు అందరు గూడ తమకి కేటాయించిన కుర్చీలలో కూర్చోవడము మొదలుపెట్టారు.

దలైలామా కాస్త మైకు అందుకొని.. నాయనలారా.ఈ రోజు మీకు నేను ఎలాంటి ఙ్ఞాన బోధ చేయను.కాని మీ సాధనలో వచ్చే ధర్మ సందేహాలకు మరియు సాధన సందేహాలకు సమాధానాలు చెపుతాను అనగానే...

ఎవరో ఒక బౌద్ధ సన్యాసి లేచి..లామాజీ.మనము నిత్యము పూజించే ఓం-మణి-పద్మ-హుం మంత్రము యొక్క అర్ధము ఏమిటో చెప్పగలరా?” అనగానే..

నాయనా.ఈ మంత్రార్ధము మణి గల పద్మము లేదా మణి పద్మము.నిజానికి మణి పద్మము అంటే మణి కాంతి ఉన్న స్పటిక పర్వతమైన పద్మాకార కైలాస పర్వతము. ఈ మంత్రార్ధములో మణి అర్ధము అనగా పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు స్పటిక పర్వతమంత పరిశుద్ధుడని..ఇంక పద్మము అనగా పరిపూర్ణ ఙ్ఞాన చిహ్నము అని మన బౌద్ధ గ్రంధాలలో చెప్పబడి ఉంది.

ఒక న్యూస్ విలేఖరి లేచి...స్వామి. బౌద్ధధర్మములో బుద్ధుడు, బోధిసత్వుడు,తధాగతుడు అంటే ఏవరు?” అనగానే..

నాయనా ..ఈ మూడు పేర్లు అనేవి బుద్ధుడు సాధన స్ధితులు అనగా సిద్దార్ధుడు బోధివృక్షము క్రింద జ్ఞానము పొందినపుడు ఆ సాధన స్ధితిని బుద్ధుడిగా..తను పొందిన జ్ఞానమును బోధ చెయ్యడముతో ఆయనను భోదిసత్వుడిగాను..ఆపై తను పూర్ణశూన్యస్ధితిని పొందడముతో తనకి తాను తధాగతుడిగా నామము పెట్టుకున్నారు.నిజానికి ఈ మూడు స్ధితులు ప్రతివారు తప్పకపొందాలని తన కాలచక్రతంతులో వీటిని శరీర,వాక్క్,మనస్సు సోపానాలుగా చెప్పడము జరిగింది.అంటే తనే కాకుండా అందరుగూడ బుద్ధుడు, బోధిసత్వుడు,తధాగతుడు అవ్వాలని అవుతారని చెప్పడము జరిగింది.

ఒక యాత్రికుడు లేచి..స్వామి. శూన్యత మరియు శూన్యతాభావము అంటే ఏమిటి?” అనగానే..

నాయనా.శూన్యత అంటే మనస్సు లేని స్థితిని పొందడము. అదే శూన్యభావస్ధితి అంటే ఇందులో మనస్సు అలాగే భావముంటుంది. శూన్యత స్థితిని పొందడము అనగా నువ్వు ఒక ఉల్లిపాయను తీసుకొని దానికున్న పొరలు తీసుకుంటూ పోతుంటే అప్పటిదాకా ఆకారంగా కనిపించిన ఉల్లిపాయ కాస్త ఎలా అయితే కనిపించకుండా పోతుందో..అలా సత్యముగా కనిపించే ఈ ప్రపంచము అలాగే ఈ దేహ మనస్సు గూడ సాధన ద్వారా వీటికున్న లక్ష పాతిక వేల కర్మ బంధ మాయ పొరలు తొలిగితే అపుడు భావనలు చేసే మనస్సు కనిపించదు. భావాల వలన ఆలోచనలు కలుగుతాయి.వీటి వలన భావానికి రూపము ఏర్పడుతుంది. ఈ రూపము మీద ప్రేమ,మోహ, వ్యామోహ, భ్రాంతి, భ్రమ, ఆశ, భయము,ఆనందము, ఆలోచన, సంకల్పము కలుగుతాయి.దానితో రేణువు కాస్త భౌతిక పదార్ధముగా రూపంతరము చెందుతుంది.ఈ భావ రహిత స్థితికి చేరడమే నిజమైన సంపూర్ణ శూన్యస్థితి అవుతుంది.ఈ శూన్యస్థితిలో సుమారుగా 18 రకాల శూన్యస్థితులు అనగా శూన్యత స్థితి,శూన్య భావ స్థితి,శూన్య స్థితి,మహా శూన్య స్థితి,  పరమ శూన్య స్థితి అంటూ  సాధన స్థితులు ఉంటాయి. అదే శూన్యభావస్థితిని పొందడము అనగా ఇందులో మనస్సు అలాగే భావము మిగిలే ఉంటాయి..ఇది దాటితే మనము పొందేది పూర్ణశూన్యస్ధితి అవుతుంది.

ఇంతలో...ఒక న్యూస్ విలేఖరి లేచి...స్వామి. బుద్ధుడి కాలములోనే శూన్యత భావ స్థితిని తట్టుకోలేక చాలామంది బౌద్ధ సన్యాసులు ఆత్మహత్య చేసుకున్నారని విన్నాను నిజమేనా ?...

నిజమే నాయనా..శూన్యత వేరుశూన్య భావ స్థితి వేరు అని ఇపుడు మీరు తెలుసుకున్నారు.కాని ఆయన కాలములో సాధకులకి ఈ తేడా తెలియకనే దేహం అశాశ్వతం-జీవితం అశాశ్వతం అని ధారణ చేసినారు. కనిపించేది అసత్యం అయినప్పుడు కనిపించని శూన్యము సత్యమైనప్పుడు..నేను  లేను..సర్వము శూన్యము అనే శూన్య భావ స్థితి చేరుకొని దానిని తట్టుకోలేక శరీర త్యాగాలు చెయ్యడము ప్రారంభించినారు.దీని నివారణ కోసం ఆనాడు బుద్ధ భగవానుడు ఏకముగా "సర్వ భిక్షు" సమావేశమును పెట్టి శూన్యత భావము గూర్చి భోధన చెయ్యడము జరిగినది.సాధనకి శరీరము ఉండాలని..ఇది లేకపోతే శూన్యత స్థితిని చేరుకోలేమని..మనది అహింసవాదము కాబట్టి ఆత్మహత్య చేసుకోవడము అనేది హింస క్రిందకి వస్తుందని అశాశ్వతం అంటే శరీరం లేకుండా పోవడం కాదని.. ఈ భావన కాస్త పూర్ణ శూన్యత స్థితికి రహదారి గావాల్సి ఉంటుందని శరీరము పైన అలాగే జీవితము పైన ద్వేషము పెంచుకోరాదని నా సూత్రాలను అర్ధము చేసుకోలేకపోతే ఇలాంటి అనర్ధాలు అపార్ధాలు కలుగుతాయని... ఈ సూత్రాలు వినడము కాదని వాటిని వివేకముతో  విశ్లేషించి అన్వయించుకోవాలని చెప్పడము జరిగినది. ఉదాహరణకు చంద్రుని చూపించే వ్రేలు మీద శ్రద్ధ పెడితే అది కాస్త శూన్యత భావ స్థితికి చేరుతుందని..దానిని తట్టుకోవడము చాలా కష్టము అని..అదే వ్రేలు మీద దృష్టి పెట్టకుండా అది చూపించే దిక్కులో ఉన్న చంద్రుడి వైపు చూడటము ఆరంభిస్తే మనస్సుకి ఏర్పడిన శూన్యత భావ స్థితి నుండి అది విముక్తి పొంది మనఃశాంతిని పొందుతూ శూన్యస్థితిని పొందుతుంది.అంటే నేను చెప్పిన సూత్రాలలో సూత్రము చెప్పిన దిక్కులో సత్యాన్ని దర్శించాలి. సత్యాన్ని అన్వేషించాలి.అలాగే సూత్రానికి మరియు ధ్యాన అనుభవానికి మధ్య అతి సున్నిత అంశముగా 18 రకాల శూన్య స్థితులు ఉంటాయని ఎవరికి వారే ఙ్ఞాన సిద్ధి పొంది తెలుసుకొని అనుభవించి ఆనందస్థితిని పొందవలసి ఉంటుందని చెప్పడము జరిగింది. 

మరో యాత్రికుడు లేచి..స్వామి.మరి శూన్యత భావ స్థితిని తట్టుకోవడానికి బుద్ధుడు ఏమి చెప్పలేదా?” అనగానే..

నాయనా.దీనికోసం ఆయన చాలా పరిశ్రమ చేశాడు.ఏదైన అనుభవ అనుభూతి పొందడానికి శూన్యత భావ స్థితి తట్టుకోవడానికి ఆయన ఏకముగా హిమాలయ యోగులను అలాగే శంభలయోగులను కలసి వారి అనుగ్రహముతో సప్త ధాతువులతో ఒక సింగింగ్ బౌలు నిర్మాణము చేశారు..దీని వలన విశ్వములో వినిపించే ఓంకార నాదమును మనము వినగలుగుతాము.అలాగే మనలోని ఓంకారనాదమును వినడానికి మన యోగచక్రాలకు తగ్గట్టుగా ఒక ప్రార్ధన గంటను తయారు చేయడము జరిగినది.దీనిని లయబద్ధముగా మ్రోగిస్తుంటే మన శరీర చక్రాలలో జాగృతి కలిగి మనలో ఓంకారనాదము వినబడుతుంది.ఇలా విశ్వములోని ఓంకారనాదమును అలాగే శరీరములోని ఓంకారనాదమును అనుసంధానము చేయడానికి డోర్జే అనే ఆయుధ పరికరమును తయారు చేయడము జరిగినది.దీని వలన ఈ రెండు నాదాలు అనుసంధానమై ఈ ఓంకారనాదాలు మిళితమై నిశ్శబ్ద నాదమైన తుంకార నాదము వినే స్థితిని సాధకుడు పొందటానికి ప్రేయర్ వీల్ ను తయారు చేయడము జరిగినది.ఈ సాధన పరికరాల వలన సాధకుడికి ధ్యానములో నిద్ర - మెలుకువ గాని మధ్యమ స్థితికి మనస్సు వెళ్ళుతుంది.ఈ స్థితిలో ఎవరైతే 48ని. దాకా ఉండగలుగుతారో వారికి సంపూర్ణ శూన్య స్థితి అనగా మనస్సే లేని స్థితిని పొందటము జరుగుతుంది. గాకపోతే ఈ సాధనస్ధితిని అనుభవజ్ఞానమున్న లామాల సమక్షములో అభ్యాసము చెయ్యాలి.లేదంటే మతిభ్రమణము లేదా శూన్యతభావస్ధితిలో శాశ్వతముగా ఉండిపోయే ప్రమాదముంటుంది.

ఇంతలో ఒక విలేఖరి లేచి..స్వామి.ఇంత వివరముగా మీరు చెబుతున్నారంటే బుద్ధుడు దీనిని ఎక్కడైన రహస్యముగా దాచారా? “అనగానే..

నాయనా.మీరు ఎప్పుడైన ప్రేయర్ వీల్ ను నిశితముగా చూసి వుంటే తెలిసేది.దీని చుట్టూ అష్ట మంగళ వస్తువులలో మూడు వస్తువులకి మూడు రంగుల రత్నాలు అనగా ఎరుపు,తెలుపు,నీలం రంగు రాళ్ళు అమర్చడం ఉంటుంది.అలాగే దీనిలోపల కాగితము చుట్టలో ఓం-మణి-పద్మ-హుం అను గురుమంత్రము 1000 సార్లు రాసి ఉన్న పేపరు చుట్ట కనబడుతుంది.అంటే బుద్ధుడు తాను తెలుసుకున్న ఈ సాధన రహస్యమును ఈ మంత్రములో ఒక కోడ్ గా అమర్చడము జరిగినది.

అంటే మీ ఉద్దేశ్యములో ఈ మంత్రార్ధము నిజముగా ఏదైన మణిని సూచన చేస్తుందా?”

నాయనా.అది నిజము గావచ్చును కాకపోవచ్చును. గాకపోతే 14వ శతాబ్దమునాటి బోధిసత్వుడు, అవలోకితేశ్వర,క్షితిగర్భ బుద్ధుడి అవతారాల ఫోటోలలో వీరి చేతులలో ఒక మణి ఉన్నట్లుగా మనకి కనబడుతుంది.అలాగే 1903-1909 ఈ మధ్య కాలంలో ఉన్న లామా ద్యోర్జి చోగ్యాల్ హిమాలయాలకి ఒక బృందముగా వెళ్ళి రహస్య గ్రామములో ఉన్న మణి ప్రాంతమును కనుక్కోవడము జరిగినది.ఈయన అక్కడికి వెళ్ళి అక్కడున్న మణి దర్శనము పొందడము గూడ జరిగినదని ఆయన ఆత్మకధలో చెప్పడము జరిగినది. లోక క్షేమము దృష్టిలో పెట్టుకొని ఈ మణి రహస్యము లోక విదితము అలాగే ప్రచారము కాలేదు.దానితో అది నిజమో లేక అబద్ధమో తెలియని సంధిగ్దత స్థితికి మాలాంటి వాళ్ళు చేరుకోవడము జరిగినది. మా దృష్టిలో మణి అంటే సహస్ర చక్రములోని అనగా మెదడు మధ్య భాగములో ఉండే పిట్యూటరీ గ్రంధియే ఈ మణిగా భావించడముగా జరుగుతోంది. ప్రత్యక్షముగా అంటే హిమాలయలలోని కైలాస పర్వతమే స్ఫటికమణి.

 అవును.పూర్ణ శూన్య స్థితికి సాధకుడు ఎలా చేరుకుంటాడు అనగానే..

నాయనా.దీని విధి విధానమంతా బుద్ధ భగవానుడు కాస్త కాల చక్ర నిర్మాణము ద్వారా లోకానికి చెప్పడము జరిగినది.ఈ చక్ర నిర్మాణములో మనకి అయిదు సాధన స్థాయిలుంటాయి.అనగా 1.ఆనందం 2.ఙ్ఞానము3.మనస్సు4.వాక్కు,5.శరీరము పంచస్థితులుంటాయని...మళ్ళీ వీటిలో ఆనంద సాధన స్థాయిలో శూన్యత స్థితి,మార్పు లేని ఆనందం,బ్రహ్మ ఙ్ఞానము,పరిహారము,త్యజించుడము అనే ఉప స్థాయిలుంటాయి.ఈ స్థితులు పొందటానికి అష్ట నియమాలు ఉన్నాయి.అనగా 1.శక్తి 2.ఆకాంక్ష 3.సిద్ధాంతం 4.ఇచ్చుట 5.క్రమశిక్షణ 6.సహనం 7. ఉత్సాహం 8.ధ్యానము అనే సాధనలు ఉన్నాయని తన కాల చక్రము ద్వారా చెప్పడము జరిగినది.అంటే ధ్యానముతో మొదలైన సాధన కాస్త పూర్ణ శూన్యత స్థితి అనే సాధన స్థితితో పూర్తి అవుతుంది అన్నమాట. 

స్వామి.ఈ మణి రహస్య చేధన చెయ్యడానికి దారి ఏమిటి?”

ఇంక ఏముంది.ఓం-మణి-పద్మ-హుం అను గురు మంత్రమే దారి చూపుతుంది.ఇదియే ది బుద్ధ కోడ్ అన్నమాట అని అంటూండగా..

ఆ ప్రక్కనే ఉన్న బౌద్ధ మ్యూజియము భవనము నుండి ఒక స్త్రీ మూర్తి భయముతో పెద్దగా….

శవము..శవము..ఒక బౌద్ధ సన్యాసి శవముగా మ్యూజియము లోపల పడి ఉన్నాడు అని అరుస్తూ కేకలు వేస్తూ పరుగులు తీయడముతో ……

ప్రసంగము చేస్తున్న దలైలామాకి అక్కడున్న అందరికి ఈ అరుపులు వినబడటముతో అందరూ గూడ ఆమె వైపు ఆందోళనగా చూస్తూ ఆమె చెప్పిన ఆ భవన గది వైపు కొందరు బౌద్ధ సన్యాసులు పరుగుతీశారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి