35 భాగం

 

35

ఆ తర్వాత నాలుగురోజులలో ఈ కామభావాలు తగ్గి ఆపై ధనభోగాల ఆలోచన భావాలు నాలో మొదలైనాయి. దానితో నగలు, ఆభరణాలు, నిధులు దాచే గుప్తనిధి పాత్ర గుర్తుకి వచ్చింది. ఈ ధన దాహము కోసము మనిషిలో స్వార్ధము పెరుగుతుంది. దీని నివారణ కోసము ప్రతి మనిషికి మంచి సంకల్పము ఉంటే స్వార్ధము లేని మంచి ఆలోచనలు కలుగుతున్నాయని తెలుసుకున్న నాలుగు రోజులకి నాలో కాంతులు విరాజిల్లుతున్న కాంతి శరీరాలున్న వాళ్లు దర్శన మిచ్చి నన్ను కవ్వించడము, ఆశ పెట్టడము, మోహింప చెయ్యడము ఆరంభించారు. అప్పుడు నాకు ధర్మచక్రము గుర్తుకు వచ్చింది. ప్రతివాడు ఏదో ఒక ధర్మముతో ధార్మిక జీవితమును అలవాటు చేసుకుంటే దేనియందు ప్రేమ, మోహ, వ్యామోహాలలో పడి బంధి కావలసిన అవసరమే ఉండదని దీనికి మంచి జీవితమును అవలంభించాలని అనుకొని నిగ్రహముగా ఉన్న నాలుగు రోజులకి నాలో నల్లటి ఆకారాలున్న ప్రేతాత్మలు, రాక్షసులు, భూతాలు, కోరిక తీరని భూతాలు ఇలా ఎందరో నాకు దర్శనమిస్తూ నన్ను భయపెట్ట సాగారు. అప్పుడు నాకు శంఖము గుర్తుకు వచ్చింది. దీనిని పూరిస్తే దీని శబ్దానికి ఏ దుష్టజీవి  లేదా ఏ దుష్ట చెడు ఆలోచనలు మనదరి చేరవని... దీనిని నిగ్రహించడానికి సాధకుడికి మంచి వ్యాయామము చేస్తుంటే మనలో దేహ ఆరోగ్యము అలాగే మానసిక ఆరోగ్యము పెరిగి అనవసరమైన ఆందోళనలు, భయాలు, పిరికి తనము తొలిగి పోతాయని  నిగ్రహించుకొని సాధన చేస్తున్న నాలుగు రోజులకి నాలో జ్ఞాన అహంకారము మొదలైంది. జ్ఞానము- అజ్ఞానము మధ్య పోరు మొదలైంది. పాప, పుణ్యాల మధ్య వైరము మొదలైంది. ఏది మంచో, ఏది చెడో తెలియని స్థితి మొదలైంది. అంటే ఏది అర్ధముకాని చిక్కుముడి నాకు గుర్తుకు వచ్చింది. దానితో చాడీమాటలు, అబద్దాలు, ఇతరులను నొప్పించే అలాగే బాధ కల్గించే మాటలు ఈ అహంకార స్థాయిలో కలుగుతాయని గ్రహించి దీనికి విరుగుడిగా మంచిమాటతో ఉండాలని నిశ్చయించుకొని నిగ్రహముగా ఉండేసరికి మళ్లీ నాలుగు రోజులకి నాలో ద్వైతస్థితి భావాలు మొదలైనాయి. ప్రతిరెండు వ్యతిరేక భావాలు అనగా స్పందన-ప్రతిస్పందన, ఆశ-భయం, ఆనందం-దుఃఖం, సుఖము-కష్టము ఇలా ద్వైత భావ ఆలోచనలు విపరీతముగా వచ్చి కలవరము పెట్టసాగినాయి. అప్పుడు నాకు గొడుగు గుర్తుకు వచ్చి దానితో వివేక బుద్ధితో చేస్తే అది మంచి పని అవుతుంది. అదే అవివేక బుద్ధితో చేస్తే చెడ్డ పని అవుతుందని మంచి అంటే పుణ్యమని, చెడు అంటే పాపమని గ్రహించి దీని సాధన కోసము నిరంతరముగా మంచిపని తో నిగ్రహించుకోవాలని సాధనను చేసిన నాలుగు రోజులకి నాలో దుఃఖము, దురాశ, దురభిమానము విభిన్న భావాలు కల్గడము మొదలైనాయి. అపుడు నీటిలో ఉండే కమల పువ్వు గుర్తుకు వచ్చింది. ఇది బురదలోను, నీటిలోను ఒకే విధంగా పెరుగుతుంది.

*** *** *** *** *** ***

దేవదత్తకి తన ప్రియ భక్తుడైన అంగుళీమాల అరెస్టు చేయబడిన విషయసమాచారము తెలిసేసరికి మనస్సు మనస్సులో లేదు.ఒక అడుగుదూరములో మణి శోధనలో వాడు దొరికిపోతాడని దేవదత్త అసలు ఊహించలేదు.వీడి ద్వారా మణిశోధన వివరాలు తెలుసుకొని ఆ ప్రాంతానికి తాను ఒక్కడే స్వయముగా వెళ్ళి ఆ చింతామణిని తెచ్చుకోవాలనే తన ఆశను వీడు దొరికి అడియాశ చేశాడని చేతిలో ఉన్న సిగార్ ను బలంగా నేలకేసి కొట్టి కసి తీర్చుకున్నాడు.ఏమైతే అది జరుగుతుందని ఇన్నాళ్ళుగా లోకానికి తెలియని తన రూపముతో నిర్వాణలామా బృందమునకు ఎదురుపడి వాడి ఆధారరహస్యముతో మణిచోటుకి తను ఒక్కడినే వెళ్ళాలని నిశ్చయించుకొని బుద్ధగయ క్షేత్రానికి బయలుదేరాడు.ఈ క్షేత్రములో ఉన్న మ్యూజియములో అంబేద్కర్ చనిపోయిన గది దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమైన ఆధారము దొరుతుందేమోనని ఆసక్తిగా అంతా వెదకటము శోధించడము ప్రారంభించాడు.కాని వాడికి ఎలాంటి ఆధారాలు కనిపించలేదు.దానితో    మారువేషములో గది బయట కాపలా కాస్తూ ఉన్నాడు.నిర్వాణలామా బృందము కోసము ఎదురుచూస్తూ ఉన్నాడు.

అంగుళీమాలకి పోలీసులు చుక్కలు చూపించేసరికి వాడు కాస్త భూగృహములో ఉన్న రహస్య గది వివరాలు అలాగే దేవదత్తతో తనకి జరిగిన సంభాషణలు ఒప్పందాలు పనులు, హత్యల వివరాలు ఒకదాని తరవాత ఒకటి చెపుతుండగా వీటిని పోలీసులు రికార్డ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు.కొంతమంది వీడు చెప్పిన తన రహస్యగదికి వెళ్ళి అక్కడున్న జాడీలలోని బొటనవ్రేళ్ళును ఆధారాల కోసము అలాగే అక్కడ వాడు హత్య చేసిన వాళ్ళ ఫోటోలు సేకరించి బయటికి వస్తుండగా వాళ్ళకి ఒక చీకటి గది కనపడినది.ఆ గదిలో లైటు వేయగానే ఆ గది గోడకి ఒక వ్యక్తి ఫోటో ఉండి దాని క్రింద   దేవదత్త అని పేరు ఉండటము గమనించి ఆ వ్యక్తి ఎవరో తెలుసుకున్న పోలీసులలో ఒక్కసారి వణుకు మొదలై కులకర్ణికి ఫోన్ చేయగా ఫోన్ కాస్త బిజీగా ఉన్నదని సమాచారము వినగానే వీళ్ళల్లో ఏదో తెలియని భయము మొదలై నిర్వాణలామా బృందమునకు ఏమి కాకూడదని తొందరలో కులకర్ణికి ఈ విషయము చెప్పాలని శరవేగముతో తాము ఎక్కిన జీపును ముందుకి పోనిచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి