47 భాగం

 

47

ఇలా నేను చెప్పిన ధ్యానబోధ సూత్రమును వీరందరిలో కొంతమంది తప్పుగా అర్ధము చేసుకొని 'దేహం అశాశ్వతం- జీవితం అశాశ్వతం' అనే శూన్యత భావస్థితి పొందడము ఆరంభించారు. నేను పూర్ణ శూన్య స్థితి పొందమని చెప్పితే వీరు కాస్త శూన్యత భావస్థితిని పొందడము చేశారు. పూర్ణ శూన్య స్థితి అంటే పూర్ణచంద్రుడు లాంటిది... శూన్యత భావ స్థితి అంటే ఈ చంద్రుడిని చూపించే వ్రేలు లాంటిదని... అంటే నేను కాస్త నా చూపుడు వ్రేలుతో పూర్ణ చంద్రుడిని చూడమని  చెప్పితే... అది కొంతమందికి అర్ధమవ్వక చంద్రుడిని చూడకుండా  చంద్రుడిని చూపే వ్రేలును చూడటము అనగా శూన్యస్థితి గూర్చి ధ్యానము చెయ్యకుండా శూన్య భావ స్థితి ధ్యాన అనుభవము పొంది ఆత్మహత్యలు చేసుకోవడము ఆరంభించేసరికి నాలో ఆవేదన మొదలైంది.

దానితో వీరందరిని ఒక చోట సమావేశము ఏర్పరచి వారితో "నాయనలారా. శాశ్వతత్వం-అశాశ్వతత్వం అనే పదాన్ని అపార్థము చేసుకుంటున్నారు. నేను చెప్పిన సూత్రాలను సరిగ్గా అర్ధము చేసుకోపోతే ఇలాంటి అనర్ధాలు కలుగుతాయి. అపార్ధాలు ఏర్పడతాయి. దీని వలన మీకే గాదు ఇతరులకి నష్టము కలుగుతుంది. మొదట సూత్రాలు వినడము గాదు. వీటిని వివేకబుద్ధితో విశ్లేషణ చేసుకోవాలి. ఆచరణలో, సాధనలో ఇది చెప్పినది నిజమా కాదాయని నిగ్గు తేల్చుకోవాలి. అపుడే  మీకు సత్యము బోధపడుతుంది. దానితో నా సూత్రాల అవసరము మీకు ఉండదు. సూత్రాలు అనేవి నదిని దాటడానికి అవసరమయ్యే పడవ లాంటిది. ఈ పడవను ఉపయోగించుకొని మీరంతా నదిని దాటాలి అంతే కాని పడవ మీద దృష్టి పెట్టకూడదు నది దాటడము మీద దృష్టి పెట్టాలి. పడవ మీద దృష్టి అనేది అశాశ్వతము అనే శూన్యభావస్థితి లాంటిది. అదే నదిని దాటడము అనేది నేనులేను-ఏమిలేదు. సర్వం శూన్యము అనే పూర్ణశూన్యస్థితికి చేరుకోవడము లాంటిదని గ్రహించండి.

              'అశాశ్వతం' అంటే శరీరము లేకుండా పోవడము కాదని... ఈ భావము అనేది 'శూన్యత' కు రహదారి కావాలి తప్ప శరీరము నాశనము చేసుకోవడముగాదని... శరీరము లేకపోతే సాధన ఎలా చేస్తారని.... సాధన లేకపోతే పూర్ణ జ్ఞానము ఎలా పొందుతారని.... మంచి జ్ఞానము పొందకపోతే మంచి సమాధి స్థితి అదే శూన్య స్థితికి ఎలా చేరుకొంటారని... ఆత్మహత్య చేసుకోవడము అజ్ఞానమని, వెర్రి ఆలోచనయని- ఆత్మహత్య గూడ హత్య చేయడం లాంటిదని... హింస లాంటిదని మనది హింస మార్గము కాదని అహింస మార్గమని వాళ్లకి గుర్తుకు చేశాను.

నా శూన్య వాదము అనేది నిజానికి వేటికి మనుగడ లేదని... ఏవి శాశ్వతంగా నిలబడవని చెప్పడము జరిగింది. అంటే కనిపించే విశ్వ జగత్తులో ప్రతి వస్తువు, ప్రతిజీవి గూడ ప్రతిక్షణము పరిణామం చెందుతూ రూపాంతరం చెందుతూ నశిస్తుంటాయి. అంటే ఏది కూడా శాశ్వతముగా ఉండదు గదా. దీని మీద అనగా 'శూన్యం' పైన భావనే చెయ్యమన్నాను కాని శూన్యభావస్థితి దగ్గర ఆగిపొమ్మని చెప్పలేదు. దానిని దాటితే కాని మనము పూర్ణ శూన్యస్థితిని అందుకోలేము. అంటే నశించేవి అంటే అశాశ్వతమని అర్ధము కాదు. మార్పు చెందేవి అని అర్ధము. చివరకు ఏమీ మిగలదు. ఏమీ మిగలవు. అంటే 'ఆత్మ' సైతం అదే మనస్సు గూడ మిగలని స్థితియే శూన్యస్థితి అవుతుంది. అదే మనస్సు మిగిలితే దీనికున్న భావము మిగులుతుంది. అన్నింటిని, అన్ని బంధాలను, అన్ని కర్మలను, అన్ని జన్మలు శూన్యము చేసి మనస్సును శూన్యము చెయ్యకుండా ఆపితే మనకి ఇది ఇచ్చే శూన్యభావస్థితి దగ్గర ఆగిపోతున్నామని తెలుసుకోండి. ఈ మనస్సు, భావము గూడ మిగలలేని స్థితికి మన సాధన కొనసాగించాలంటే తప్పనిసరిగా శరీరముండాలి అని గ్రహించండి. పూర్ణత్వాన్ని చేరుకోవాలంటే మనస్సు, భావము లేకుండా ఉండాలి. ఇదియే పూర్ణ శూన్యస్థితి అవుతుంది. పూర్ణత్వాన్ని ఆమోదించడము అంటే శూన్యమును ఆమోదించడము అవుతుంది. అస్తిత్వం ఎపుడికి శూన్యం కాదు. నిజానికి నాస్తికత్వమే శూన్యము అవుతుంది. అంటే అస్తిత్వం అనేది శూన్యము కాదు. ఇందులో మనస్సు, భావము అనే రెండు ఉంటాయి. ఇది శూన్యతాభావము అవుతుందని తెలుసుకోండి. దీనిని దాటితే కాని పూర్ణ శూన్యస్థితికి చేరుకోవాలి. పూర్ణ శూన్య స్థితి పొందడమే మహా నిర్యాణ నిర్వాణ స్థితి. అది మార్పులేని ఆనంద రూపమైన శాంతిస్థితి పొందడము అవుతుంది.

దానితో కొంతమందిలో మార్పు వచ్చింది. కాని మరికొంతమందికి ఈ జ్ఞాన బోధ గూడ అర్ధము అయ్యి అర్ధము కాలేదని నాకు తెలిసింది. దానితో నేను కాస్త ఆలోచనలో పడ్డాను. ఇలాంటివారికి బోధ చేస్తే... అది విన్నంతవరకు వీళ్లకి అర్ధమైనట్లుగా ఉంటుంది. ఆచరణకి వచ్చేసరికి అది వ్యర్ధమవుతోందని గ్రహించాను. దానితో పరిపూర్ణ శూన్యస్థితికి ప్రతిసాధకుడు వెళ్లడానికి ఏదైన పరిష్కారమార్గము దొరుకుతుందేమోనని దేశాటనకి బయలుదేరాను.

*** *** *** *** *** ***

నిర్వాణలామా బృందము మణికైలాష్ పర్వతము నుండి కైలాస పర్వతములో ఉన్న అగర్తల మరియు శంభల గ్రామాలలో ఉన్న పాదరస చింతామణి మరియు బ్రహ్మచింతామణి దర్శనము కోసము అటువైపుగా ప్రయాణించడము మొదలుపెట్టారు.కాని వీళ్ళకి తెలియని విషయము ఏమిటంటే తాము అంతాగూడ చాలా చాలా డీప్ హిమాలయ ప్రాంతాల వైపు వెళ్ళుతున్నామని..అక్కడ ఉష్ణోగ్రతలు మైనస్ -18 డిగ్రీల నుండి -72 డిగ్రీలగా ఉంటుందని.. ఈ ఉష్ణోగ్రతలలో మానవశరీరము మనుగడ సాగించలేక మంచుకి బిగిసిపోయి కట్టెలాగా మారుతుందని పాపము వీళ్ళలకి తెలియదు.ఇలాంటి ప్రయాణాలు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవ జ్ఞానుల సహాయము తీసుకొవాలని మన పెద్దల ఉవాచ.ఎవరు వింటారు.ఎవరికి తోచింది వారు చేస్తారు గదా.ఇలా వీళ్ళుగూడ చేస్తున్నారు.

ఇంతలో ఆనందభిక్షువుకి ఒక సందేహము వచ్చి గురూజీ..అసలు నిజముగానే శంభల గ్రామము ఉన్నదా?దీనిని చూసినవాళ్ళు ఎవరైనా ఉన్నారా?” అడగానే..

మిత్రమా..

శంభల గ్రామస్య ముఖ్యస బ్రహ్మణస్య మహాత్మన:

భవనే విష్ణుయశస: కల్కి ప్రాధుర్భవిష్యతి

అంటే దీని అర్ధము విష్ణుమూర్తి యొక్క దశమ అవతారమైన కల్కి భగవానుడి అవతార ఆరంభ స్ధానమే శంభల గ్రామమని మనకి స్వయంగా విష్ణుపురాణము చెపుతోంది.ఇదేగాకుండా రామాయణములోని బాలకాండలో విశ్వామిత్ర మహాముని సిద్ధాశ్రమము ఉన్న ప్రాంతం అలాగే పాండవులు చేసిన యాగాలకి అనంత సంపదలు సమకూర్చిన రహస్యగ్రామ అయిన ఈ శంభల గ్రామము అని మనకి రామాయణము,మహాభారత ఇతిహాస గ్రంథాలు చెపుతున్నాయి.పైగా ఈ గ్రామ ప్రస్తావన మన బౌద్ధధర్మానికి చెందిన కాలచక్ర తంతులో ఏకముగా ఈ నగర ప్రవేశ దారినే మన బుద్ధుడు పెట్టాడు గదా.దీనిని ఆధారము చేసుకొని ఫ్రాన్స్ కి చెందిన డేవిడ్ నీల్ అనే ఆవిడ ఈ నగర సంచారము చేసి అక్కడున్న శంభలయోగుల ఆశీస్సులు పొందివచ్చి 101 సం.రాలు పైగా ఆరోగ్యముగా జీవించినదని మన టిబెట్ లామాలు చెప్పుకోవడము నేను విన్నాను.

1920 సం.లో రష్యాకి చెందిన సైనికబృందము ఈ నగరమునకు గూర్చి అన్వేషించినారని తెలుసుకొని 1930 సం.లో జర్మనీ నేత అయిన హిట్లర్ కాస్త హెన్రిచ్ ఇమలర్ నేతృత్వములో ఒక బృందమును ఈ నగర పరిశోధన కోసము నియమించడము జరిగింది.వీళ్ళు ఈ గ్రామవాసులలో కొంతమందిని కలుసుకొని వాళ్ళు ఉపయోగిస్తున్న ఆధునిక టెక్నాలజీ విజ్ఞానము వీళ్ళు పొంది ఇక్కడికి వచ్చినారని అలాగే వాళ్ళు నిత్యము పూజించే బ్రహ్మచింతామణి మీద ఉన్న స్వస్తిక్ గుర్తును హిట్లర్ కాస్త తన జెండా గుర్తుకు ఉపయోగించుకోవడము జరిగినదని ఒక కథనం ప్రచారములో ఉంది. మేడం బ్లవట్ స్కీ అనే యోగిని ఈ నగరమును ప్రత్యక్షముగా చూడటము జరిగినదని అక్కడ ద్వాపరయుగము నాటి మనుష్యులను చూడటము,వారితో మాట్లాడము,వారితో ఫోటోలు దిగడము జరిగినదని వీటిని రహస్య సిద్ధాంతం [The Secret Doctrine] అను తన పుస్తకములో వివరించడము జరిగింది.

ప్రకృతి వెంటనే స్వామి..ఈ శంభల గ్రామములో పరిశోధన చేసే ప్రత్యేకతలు ఏమి ఉన్నాయి అనగానే

ప్రకృతి.ఇపుడు మన భూమ్మీద ఉన్న టెక్నాలజీకి సుమారుగా నాకు తెలిసి 10లక్షల కోట్ల సం.లు వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీని వాడుతున్నారని నా పరిశోధనలో తెలుసుకున్నాను. అంతెందుకు గంగానది కుంభమేళాకి వచ్చే నాగసాధువులు గూర్చి నేను తెలుసుకున్న ఒక విషయము చెపుతున్నాను.వీళ్ళు మనకి 12సం.రాలని వచ్చే కుంభమేళాకి వీరంతా గుంపులు గుంపులుగా తండోపతండాలుగా సుమారుగా ఒకేసారి 18 లక్షల నుండి 36 లక్షల దాకా ఒకే గుంపుగా వచ్చి మొదటి స్నానము చేసి వెళ్ళిపోతారు.విచిత్రము ఏమిటంటే ఇన్ని లక్షల మంది ఒక గుంపుగా వచ్చినను మనకి ఎక్కడ ట్రాపిక్ సమస్య రాకపోవడము పైగా వీళ్ళు ఎలా ఏమి ఎక్కి వస్తారో ఇపుడివరకు ఎవరికి తెలియదు.ఎందుకంటే ఇంతమంది రైళ్ళు లేదా విమానాలు లేదా బస్సులు లేదా ఇతర వాహనాలు ఎక్కి వచ్చినట్లుగా ఎక్కడ మనకి కనిపించదు.నదీ స్నానము చేసే ముందు ఉన్న ఈ లక్షల గుంపు ఈ స్నానము అయిన తర్వాత ఈఈ గుంపు ఎక్కడికి ఎలా వెళ్ళతారో ఇంతవరకు తెలియదు.నా పరిశోధనలో వీళ్ళు సరిగ్గా నదీస్నానానికి రెండు కి.మీ దూరములో కనపడతారు. స్నానము చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఒక కి.మీ దాకా కనపడి ఆపై కనిపించకుండా పోతారు.అంటే వీళ్ళు సూక్ష్మశరీరయానముతో హిమాలయాల నుండి వచ్చి స్నానాలు చేసుకొని తిరిగి తమ స్వస్ధలాలకి వెళ్ళిపోతారని నేను తెలుసుకొని ఆశ్చర్యము చెందాను.అంటే వీళ్ళకి ఈ నానో టెక్నాలజీని ఎక్కడి నుంచి తెలుసుకున్నారని అనుకున్నపుడు వీళ్ళకి మాత్రమే ఎపుడు గావలంటే అపుడు రహస్యగ్రామాలైన అగర్తల,శంభల గ్రామాల దర్శనానికి వెళ్ళివస్తుంటారని మన బుద్ధుడు ప్రతిపాదించిన కాలచక్ర తంతులో చెప్పిన జ్ఞాన నిర్మాణములో ఉన్న 16 స్తంభాలలో నాలుగు స్తంభాలకి నాలుగు నల్లని కత్తులు ఉంచడము అనేది ప్రతి నిత్యము ఆయుధాలుగా  ఖడ్గము లేదా త్రిశూలము లేదా గద లేదా మహా శంఖం ధరించే నాగాసాధువుల గూర్చి చెప్పడము జరిగినదని నేను తెలుసుకున్నాను.అందరు అనుకున్నట్లుగా ఈ సంప్రదాయము ఆదిశంకరాచార్యుడి నుండి రాలేదు అంతకు ముందే ఉన్నదని దానిని ఈయన వెలుగులోనికి తీసుకొని వచ్చి అభివృద్ధి చేశారని నాకు అర్ధమైంది. అంటే ఈ నాగసాధువులు కాస్త శంభలయోగుల ద్వారా ఈ నానో టెక్నాలజీని పొందారని మనకి ఖచ్చితముగా తెలుస్తోంది గదా.ఇది వీళ్ళకి అతి చిన్న విషయము గావచ్చును కాని మనకి అంతుబట్టని రహస్యాలలో ఇది ఒకటిగా మిగిలిపోయింది.ఇంతటి టెక్నాలజీని పొందాలని హిట్లర్ ఏకముగా ఒక సభ్యుల బృందమునే ఏర్పాటు చేసి విశ్వ ప్రయత్నాలు చేశాడంటే ఈ గ్రామములో పరిశోధన చెయ్యడానికి మనము ఊహించని... కలలో గూడ అనుకోని ఎన్నో ప్రత్యేకతలు ఉండి ఉంటాయి గదా. అంతెందుకు అగర్తల గ్రామవాసులు పూజించే సప్తధాతువుల నిర్మిత పాదరస చింతామణి నుండి విశ్వశూన్యములో వినిపించే ఓంకారనాదము వస్తోందని ఈ గ్రామ దర్శనము చేసిన మన బుద్ధభగవానుడు కాస్త ఈ సప్తధాతువులతో సింగింగ్ బౌల్ తయారుచేసి దానిని నుండి 7mhz ఉన్న విశ్వ ఓంకారనాదము వచ్చేటట్లుగా నిర్మాణము గావించాడు గదా.దానితో ఈ సింగింగ్ బౌల్ కాస్త శాంతి బౌలు అయినది గదా.ఇంక ఇంతకన్నా మనకి ఏమి నిదర్శనాలు గావాలో ఆలోచించు అనగానే

ఆనందభిక్షువు వెంటనే గురూజీ.ఈ రహస్యగ్రామము ఇపుడు ఎక్కడ ఉన్నదో అనగానే

మిత్రమా.మనకి ఆధారముగా దొరికిన కాలచక్రయంత్రములోని తాళపత్రాలలో ఉన్న ప్రాంతాల పేర్లు ఇక్కడ ఇపుడున్న వాటి కొత్తపేర్లులకి ఏలాంటి సంబంధము కనిపించడము లేదు.దీని ప్రకారము చూస్తే గోబి ఎడారి ప్రాంతములో ఉన్న రహస్య సొరంగమార్గము ద్వారా వెళ్ళితే కైలాస పర్వతము అడుగుభాగమునకు చేరుకుంటుందని ఈ మార్గము ద్వారా మన బుద్ధభగవానుడు వెళ్ళి ఈ గ్రామదర్శనము చేసుకున్నాడని ఈ తాళపత్రాలు చెపుతున్నాయి.కాని ప్రస్తుతము ఈ మార్గము ఇపుడు అక్కడ ఎక్కడ ఉన్నదో ఎవరికి తెలియని పరిస్ధితి.కేవలము అక్కడ ప్రస్తుతము ఈ రహస్య గ్రామ నమూనాల సిమెంట్ కట్టడాలు మరియు ఆశ్చర్యముగా ఎరుపు,పసుపు రంగుల దేవాలయాలు అలాగే సహజసిద్ధమైన ధ్యానగుహలు మనకి ఇక్కడ కనపడతాయి.ఆ తర్వాత ఈ శంభల గ్రామదర్శనానికి మరో మార్గముగా మనకి ఎవరెస్ట్ శిఖరమునకు వాయువ్యదిశలో ఉన్న సరస్వతినది మంచుమైదానము అడుగు ఉన్న సొరంగమార్గము ద్వారా వెళ్ళితే మనము కైలాస పర్వతము అడుగుభాగమునకు చేరుకోవచ్చును.అలాగే మరో మార్గముగా మన బౌద్ధలామాల అభిప్రాయము ప్రకారము అయితే కైలాస పర్వతమునకు ఈశాన్యముగా ప్రవహించే గోముఖ మంచు జలపాతానికి ఈశాన్యములో ఉండే మంచు పర్వతాల మధ్య ఉన్న మంచులాంటి స్ఫటికమందిరములోనికి వెళ్ళితే అక్కడ ఉన్న సొరంగమార్గము ద్వారా వెళ్ళితే మనకి కైలాస పర్వత అడుగుభాగములోనికి చేరుతాము.వీటిలో నాకు తెలిసి ఎవరెస్ట్ శిఖరము దగ్గర ఉన్న సరస్వతినది మార్గము ద్వారా వెళ్ళడానికి మనకున్న తాళపత్రాల ఆధారాలున్నాయి అనగానే

 ప్రకృతి వెంటనే స్వామి..మరి మనము ఈ మార్గము ద్వారా వెళ్లవచ్చుగదా అనగానే..

ప్రకృతి..మనము ఈ మార్గములోనే వెళ్ళితే కాని అగర్తల మరియు శంభల గ్రామ దర్శనాలు అవ్వవు.కాని ఈ ప్రయాణము అంతాగూడ పద్మవ్యూహము లాంటిది.మనకి ఉన్న ఆధారాల ప్రకారము చూస్తే మనకి నాగసాధువు,మంచు జంతువులు,మహా చౌహాన్ దర్శనం,మాట్లాడే ఖోజార్ నాథ్ దర్శనం,యతి దర్శనం,సప్తచిరంజీవి దర్శనం ఆపై దేవత పుష్పవనము దర్శనాలు అయితే కాని మనము ఈ రహస్యగ్రామాలకి చేరుకోలేము.ఇవి అన్నిగూడ జరుగుతాయో లేదా ఎలా జరుగుతాయో ఎవరికి వారే స్వానుభవాల బట్టి మారుతుందని..ఇందులో వీళ్ళు పెట్టే దర్శన అనుగ్రహ మాయలలో పడిపోయి ఆగిపోయిన వారు ఎందరో ఉన్నారని నా పరిశోధనలో తెలిసింది.మనకి ఈ మార్గము తప్ప వేరే అవకాశము లేదు.ఏమి జరుగుతుందో మనకి తెలియని పరిస్ధితి అనగానే

ఆనందభిక్షువు వెంటనే గురూజీ..మీరు చెప్పిన వ్యక్తులు మరియు జంతువులు అనగా మంచుపులి,మంచు ఏనుగు,మంచుసింహము బలిష్ట వ్యక్తి గాలిగోపురాలు మోస్తు ఉన్నట్లుగా అలాగే దేవతలు ఉన్నట్లుగా మరియు దేవత పుష్పాలు,మణులు,డ్యోర్జీలు…,అమరికలను మన కాలచక్రతంతులో అమర్చి ఈ రహస్యగ్రామలకి వెళ్ళేటపుడు వచ్చేవాటిని ఈ విధంగా అమర్చి ఉంటారని నాకు అనిపిస్తోంది అనగానే

ఇది నిజమే అంటూ నిర్వాణలామా అనేసరికి ఈ ముగ్గురు కలిసి మాట్లాడే ఖోజార్ నాథ్ విగ్రహమూర్తి ఉన్న తక్లాకోట్ ప్రాంతము వైపు నడకయాత్ర కొనసాగించారు.

ఇలా వీళ్ళు సుమారుగా మూడు మైళ్ళు నడిచి వెళ్ళుతున్నపుడు

వీళ్ళకి అనుకొని అతిధి లాగా

నగ్న విభూదిధారి….చేతిలో ఒక త్రిశూలము,మరొ చేతిలో ఒక మహా శంఖమును పట్టుకొని గట్టిగా దానిని ఊదుతూ నాగసాధువు వీళ్ళ ముందు దర్శమిచ్చి హిందీ భాషలో ఈ బృందమును చూస్తూ పెద్దగా

ఒరేయి మానవ పశువులు లారా..ఏటు వెళ్ళుతున్నారు.దట్టమైన మంచులో మీ శరీరాలు గాలిలో కలిసి పోతాయి. ఉష్ణము లేక చలికి గడ్డ కట్టి చనిపోతారు.ఇటు రండి అనగానే

నిర్వాణలామా బృందము ఈయన దగ్గరికి వెళ్ళి నమస్కారము చేసి హిందీలో తాము ఎక్కడికి వెళ్లుతున్న విషయము చెప్పగానే అయితే మీరు తెలుగు వాళ్ళా? పైగా రహస్య గ్రామ దర్శనానికి వెళ్ళుతున్నారు.ఇలా వెళ్ళితే మీ శరీరాలు నాశనమవుతాయి.అందుకు నా దగ్గర ఉన్న మూలికలు మీకు అవసరపడతాయి.ఇవి మీకు గావాలంటే నాకు మీ తెలుగు సాహిత్యములో శ్రీనాధుడు ఒక వేశ్యకాంతతో చెప్పిన పద్యమునకు ఆ వేశ్యకాంత చెప్పిన సమాధాన పద్యము యొక్క అర్ధము నువ్వు చెప్పాలి

అంటూ వేశ్యకాంతతో శ్రీనాధుడు అన్న పద్యము అంటూ

"పర్వతశ్రేష్ట పుత్రిక పతి విరోధి,

అన్నపెండ్లాము అత్తను గన్న తండ్రి

ప్రేమతోడుతవానికి పెద్ద బిడ్డ.

సున్నమిప్పుడే తేగదే సన్నుతాంగి."

 

అనగనే దీనికి ఆ వేశ్యకాంత  ఈయనికి ఒక పద్యము రూపములో ఈ విధంగా సమాధానము చెప్పింది. ఆ పద్యము ఏమిటంటే

"శతపత్రంబులమిత్రుని

సుతుజంపినవానిబావ సూనుని మామన్

సతతము తలదాల్చిన శివ

సుతు వాహన వైరి వైరి సున్నంబిదిగో"

 అని చెప్పగానే ఈ కవిసార్వభౌముడు ముక్కున వేలువేసుకొని ఎంత మాట అంది అని ఎందుకు అన్నాడో ఇపుడు నాకు చెప్పు అనగానే...

దానికి నిర్వాణలామా గూడ చిరునవ్వు నవ్వి స్వామి.అసలు శ్రీనాధుడు ఆమెతో ఏమి అన్నాడంటే ఓ దర్రిదపు దానా.. సున్నము తీసుకొని రావే అన్నాడు.దీనికి ఆమె అంతే సమాధానముగా ఓ కుక్కా..ఇదిగో సున్నము అంటూ సమాధానమిచ్చింది.

 నాగసాధువు వెంటనే ఈ పద్యాలు చూస్తూంటే ఇలాంటి అర్ధములు ఎలా వస్తాయి అనగానే

స్వామి..మీకు వివరముగా చెపుతున్నాను. శ్రీనాధుడు చెప్పిన పద్యమును విశ్లేషణ చేస్తే అనగా

పర్వతశ్రేష్ట పుత్రిక అనగా పర్వతాలలో శ్రేష్ఠుడైన హిమవంతుని కూతురు పార్వతి..

పతి విరోధి  అంటే పార్వతి పతి శివుడు.ఈయన విరోధి అంటే మన్మధుడు.

అన్న పెండ్లాము = మన్మధుడు అన్న బ్రహ్మ..ఈయన భార్య సరస్వతి.

అత్తను గన్న తండ్రి = అంటే సరస్వతి అత్త మహాలక్ష్మీ.ఈమె కన్న తండ్రి అంటే సముద్రుడు..

ప్రేమతోడుతవానికి పెద్ద బిడ్డ అంటే సముద్రుడు ప్రేమతో కన్న పెద్ద బిడ్డ జ్యేష్ఠాదేవి..మరి ఈమెను దరిద్రదేవత అంటారు.అంటే ఓ దర్రిదపు దానా సున్నము తీసుకొని రావే అన్నట్లే గదా.

దీనికి సమాధానముగా ఈ వేశ్యకాంత చెప్పిన పద్యమును విశ్లేషణ చేస్తే అనగా

శతపత్రంబుల మిత్రుడు అంటే తామరపుష్పాలకి మిత్రుడు సూర్యుడు..

సుతుజంపినవానిబావ అంటే... సుతు అంటే సూర్యకుమారుడు కర్ణుడు..చంపినవాని బావ అంటే కర్ణుడిని చంపినవాడు అర్జునుడు.మరి ఈయన బావ అంటే శ్రీకృష్ణుడే గదా.

సూనుని మామన్ =శ్రీకృష్ణుడి కుమారుడు ప్రద్యుమ్నుని గదా. ఈయన మామ అంటే చంద్రుడు గదా.

మామ సతతము తలదాచ్చిన శివ అంటే చంద్రుడిని నిత్యము తలలో ధరించేవాడు శివుడే గదా.

సుతు వాహన వైరి వైరి అంటే శివుడి కుమారుడు గణపతి.ఈయన వాహనము ఎలుక..దీని శత్రువు పిల్లి..మరి దీని శత్రువు కుక్కయే గదా.  కుక్కా..ఇదిగో సున్నము అన్నట్లే గదా.

నాగసాధువు వెంటనే చాలా బేషుగ్గా విశ్లేషణ చేసి సరిగ్గా నేను అడిగిన పద్యాలకి సమాధానము చెప్పావు.నీ విశ్లేషణ తాత్విక తార్కిక వివేకబుద్ధి ఎలా ఉన్నదో అని ఈ పరీక్ష పెట్టాను.ఒకటి బాగా గుర్తుంచుకో..ఈ గ్రామాలకి నీవు వెళ్ళుతున్న దారిలో ఇలా ఎన్నో మర్మరహస్యలను నీకున్న వివేకబుద్ధితో దాటుకోవాలి.నీకు ఈ గ్రామ దర్శనమునకు అర్హత,యోగ్యత ఉన్నాయి.ఇదిగో ఈ వేర్లు మీ పంటి కింద పెట్టుకొని రసమును పిలుస్తూ ఉండాలి.ఇలా ఇది 41 రోజుల మాత్రమే ఈ వేరు ప్రభావము ఉంటుంది.ఆ తర్వాత ఈ వేరు మీకు పనిచెయ్యదు.అంటే ఈ లోపులే మీరు అనుకున్న చోటుకి వెళ్ళాలి.అపుడిదాకా ఈ వేరు రసము అధిక  చలి నుండి రక్షిస్తుంది.అలాగే మీకు అడ్డుగా కంటికి కనిపించని అదృశ్యశక్తులను చూపిస్తుంది.వాటిని ఎలా దాటుకోవాలో అప్పటి పరిస్ధితులను బట్టి మీరే నిర్ణయించుకోవాలి అంటూ హర ఓం..సాంబ..ఓం నమ:శివాయ అంటూ ముందుకి వెళ్ళి అదృశ్యమయ్యే దృశ్యము చూసిన ఆనందభిక్షువుకి, ప్రకృతికి నోటమాట రాలేదు.ఇలాంటి నాగసాధువుకి కామరూప విద్య,అదృశ్యవిద్య,ఆకాశయానం,పరకాయప్రవేశ విద్య లాంటి ఎన్నో విద్యలు చాల చిన్నవి.అదే మానవులకి అంతుపట్టని విద్యలు అంటూ నిర్వాణలామా అనగానే ఈ బృందము ముందుకు బయలుదేరారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి