39 భాగం

 

39

కళ్లు తెరిచి చూశాను. దానితో నేను ధ్యానములో 40 రోజులు పూర్తి అయినాయని గ్రహించాను. ఎదురుగా నేను కూర్చున్న బోధి వృక్షము ఆకు నన్ను దగ్గరికి రమ్మని పిలిచినట్లు అన్పిస్తే.... దాని దగ్గరికి వెళ్లితే అందులో సూర్య,చంద్రులు,నక్షత్రాలు, గ్రహాలు కనిపించసాగాయి. సూర్యరశ్మి లేనిదే పత్రానికి జీవము ఉండదు. సూర్య వేడిమి లేనిదే పత్రానికి పచ్చదనము ఉండదు. ఆ పత్రములో మేఘ చలనము కన్పించసాగింది.మేఘాలు లేకపోతే వర్షాలు పడవు. ఇవి లేకపోతే చెట్లు బ్రతకలేవు. అంటే ఒక ఆకులో భూమి, ఆకాశం,మనస్సు, కాలము కనబడసాగాయి. అంటే ఆకులో సూర్యరశ్మిలో, మేఘాలలో, చెట్టులో ఎప్పుడి నుండో ఉన్నాయని అంటే ఇవి ఆకులో క్రొత్తగా పుట్టలేదని... వీటి సమ్మేళనముతో ఈ ఆకు రూపుదిద్దుకున్నదని అంటే ఈ లెక్కన ఈ విశ్వసృష్టిలో ఏది క్రొత్తగా జన్మించడము అలాగే మరణించడము అనేది లేదని.... జననము నుండి మరణము అలాగే మరణము నుండి జననము ఒకదానికొకటి భావరూపాలు రూపాంతరం చెందుతున్నాయని... అంటే ఒకదాని కారణంగా మరొకటి ఏర్పడితే... ఒకదాని కారణంగా మరొకటి పరిణామం చెందుతోందని నిజానికి ఉన్నది లేదు. పోయింది లేదు. అంటే అన్ని ఉన్న ఏమి లేనట్లేనని... కనిపించేది అసత్యమని కనిపించనిది సత్యమని నాకు ప్రత్యక్ష జ్ఞాన అనుభవము అయింది.

దానితో నా మనస్సు ఉల్లాసమైంది. నాకు అష్టసిద్ధుల ప్రభావము వలన శరీరము గాలిలో తేలి పోతున్నట్లుగా పాదాలు నేలను తాకడము లేదని గ్రహించి దానితో నేను నిగ్రహించుకుంటూ అంటే ప్రతి మనిషి జ్ఞానానికి అర్హుడేనని, ప్రతివారిలోను జ్ఞానబీజాలుంటాయని... ఇవి సాధన అనుసారముగా ఎవరికి వారే సాధన చేసి సిద్ధి పొందితే అన్ని రకాల కర్మ బంధనాల నుండి విముక్తి పొందుతాడని ఈ రోజే నాకు తెలిసింది. అంటే నాలో జ్ఞానజ్యోతి వెలిగింది. నాకు జ్ఞాన మార్గం దొరికింది. నేను అనుకున్న గమ్యము చేరుకున్నట్లేగదా. నా తపస్సు ఫలించినట్లేగదా. నా లక్ష్యము సిద్ధించినట్లేగదా. అంటే ఎన్నో సంవత్సరాల నా ఆవేదన, రోదన, పరివేదన, ఆశలు, అవమానాలు, అపజయాలు, అంతరించినట్లేనని గ్రహించగానే నా మనస్సు ప్రశాంతమైంది. నిర్మలమైంది. హృదయం తేలిక అయింది. దానితో ఏ ప్రజల కోసము ఇన్ని సంవత్సరాలు నేను తపస్సు చేశానో, ఆ తపఃఫలం వాళ్లందరికి పంచిపెట్టాలని వాళ్లంతా తనకోసము ఎదురుచూస్తూ ఉంటారన్న భావాలు నన్ను కదిలించడము మొదలుపెట్టాయి. ఈ విషయము సుజాత, స్వస్తికి చెప్పాలని కబురు పంపించాను. వాళ్లకోసము నేను ఆనందముగా, ప్రశాంతముగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే వాళ్లకి నేను తెలుసుకున్న సత్యమును నా తొలి జ్ఞానబోధ చెయ్యాలని అనుకున్నాను.

            *** *** *** *** *** ***

ఇలా అందరు గూడ ఈ రహస్య గది నుండి బయటికి వచ్చిన తరవాత కులకర్ణి కాస్త జేసి కేసి చూస్తూ

జేసి.మీ నాన్న గారి శవమును మార్చురీ నుంచి తెప్పించాను.ఆయనకి జరగవలసిన అంత్యక్రియలు చేసి రా.ఈ లోపున నేను మన నిర్వాణలామాతో కొన్ని విషయాలు మాట్లాడుతాను అనగానే

ఓకే సార్.నేను అలాగే నా భర్త అయిన థామస్ కలిసి ఈ పనులు పూర్తిచేసుకొని మీ దగ్గరికి వస్తాము

 అంటూ తండ్రి శవమున్న చోటు వైపుకి వెళ్ళిపోయారు.

కులకర్ణి దీర్ఘశ్వాస తీసుకొని నిర్వాణలామా.బుద్ధ భగవానుడు ఈ మణుల కోసము హిమాలయాలకి వెళ్ళాడని ఏమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా?”అనగానే

నిర్వాణలామా వెంటనే స్వామి.హిమాలయాలకి బుద్ధుడు వెళ్ళాడని అనటానికి అక్కడ మనకి మూడు చోట్ల ఆయన పాద ముద్రలు కనబడతాయి.అనగా కైలాస పర్వత పరిక్రమములో ఈ పాద ముద్రలు మూడు చోట్ల మనకి కనబడతాయి.మొదటి పాదముద్రలు మనకి పడమటి  తార్సెన్ కు 7కి.మీ.దూరములో ఉంటే రెండవ పాద ముద్రలు మనకి దిరేబూ కు 15 కి.మీ దూరములో ఉంటే మూడవ పాద ముద్రలు మనకి డోల్మా కనుమకి 4 కి.మీ దూరములో తూర్పు లోయలో దర్శనమిస్తాయి.అలాగే బౌద్ధ ధర్మ గ్రంధాల ప్రకారము చూస్తే మానససరోవరములో పూసే పద్మాలలో బుద్ధుడు అలాగే భోధిసత్వుడు కూర్చునేవారని వ్రాసి ఉంది.ఇది గాకుండా కైలాస పర్వతము చుట్టూ ఉన్న ఎనిమిది పర్వతాల మీద ఎనిమిది బౌద్ధ ధర్మ గోంపాలు అదే మఠాలున్నాయి.గోసుల్ గోంపా,భివూ గోంపా,లాంగ్-పోనా గోంపా,సెరాలుంగ్ గోంపా,చెక్కెస్ గోంపా,యెర్న్ గో గోంపా,బోన్రీ గోంపా,ధుగోల్లో గోంపా అని పేర్లుతో ఈ మఠాలున్నాయి.ప్రస్తుతానికి ఇందులో మనకి అయిదు మాత్రమే కనబడతాయి.మిగతావి లుప్తమైనాయి.అలాగే 14 వ శ||నాటి బుద్ధుడి చిత్రాలలో చేతిలో ఒక మణి పట్టుకున్నట్లుగా అది చింతామణి యని బౌద్ధధర్మ గ్రంధాలలో చెప్పబడింది.పైగా కైలాస పర్వతము చుట్టూ మనకి ఓం-మణి-పద్మ-హుం అనే మణి మంత్రాలు ఉన్న రాళ్ళు,జెండాలు ఈ మంత్ర సాధన చేస్తున్న బౌద్ధ సన్యాసులు,సాధువులు లామాలు తరచుగా కనబడతారు.

నిర్వాణలామా.మీ ఉద్దేశ్యము ప్రకారము బుద్ధుడు ఈ మణి ఆశించాడా?”

స్వామి.ఆయన రాజభోగాలు వదలిపెట్టి సన్యాసము స్వీకరించిన తపశ్శాలి.ఆయనికి తెలియని మణులు,రత్నాలు,వజ్రాలు ఉంటాయా?ఆలోచించండి.గాకపోతే తాను ప్రతిపాదించిన శూన్య సిద్ధాంతమును ఆచరించేవాళ్ళు తట్టుకోలేక శూన్యభావ స్థితిని పొంది ప్రపంచం అశాశ్వతం-దేహ జీవితం అశాశ్వతం అని ఆత్మహత్యలు చేసుకోవడము ఆయనికి బాధ కలిగించింది.దానితో దీనికి సరియైన పరిష్కార మార్గమును కనుక్కోవాలని తిరిగి ధ్యానము చేయడము ప్రారంభించినపుడు ఆయనకి ధ్యానములో మెదడు మధ్యభాగములో బంగారపు వర్ణ మణి ఉన్నట్లుగా దీని ప్రభావము వలన జీవుడిలో కష్ట నష్టాలు కలుగుతున్నాయని గ్రహించి ధ్యాన నిష్ఠ కొనసాగించగా హృదయములో మరో తెల్ల మణి కాంతి ప్రసారము గమనించగా జీవుడికి కష్ట నష్టాలు కలగడానికి కారణము ఆ జీవుడికి ఉండే కోరికయే మూలమని గ్రహించి మరింతగా ధ్యాన నిష్ఠను కొనసాగించగా కంఠమునందు నీలిరంగు మణి కాంతి ప్రసారాలు గమనించి జీవులు కోరికల మాయలో పడటానికి కారణము అతడికి సరియైన ఙ్ఞానము లేకపోవడమేనని గ్రహించగానే ఆయన హృదయపద్మము నుండి ఓం-మణి-పద్మ-హుం అను గురుమంత్రము మొట్టమొదటిసారిగా వినబడింది.తరవాత ధ్యానము నుండి మేల్కొని ఈ మణులు నిజముగా భూమి మీద ఉండే అవకాశాలు ఎక్కడ ఉన్నాయో శోధన మొదలుపెట్టారు.అది హిమాలయాల దాకా ఈ పరిశోధన కొనసాగించడము అక్కడ కైలాసపర్వతములోని క్రిందభాగములో ఉన్న అగర్తల గ్రామములోకి వెళ్ళీ సప్త ధాతువులతో తయారైన పాదరస చింతామణిని చూడటము దానిని తాకగానే తనలో శాంతి భావము కలగటముతో శూన్యభావ స్థితిని సాధకుడు ప్రత్యక్షముగా దాటాలంటే సప్తధాతువులతో తయారు చేసిన సింగింగ్ బౌల్ నిర్మాణము చేయడము జరిగింది.ఆ తరవాత ఈయన శంభల గ్రామములోనికి వెళ్ళి బ్రహ్మ చింతామణి దర్శనము పొందటముతో ఈయన కాస్త విశ్వములో వినిపించే ఓంకార నాదమును మనలో వినిపించే ఓంకారనాదమును అనగా విద్యుత్ అయస్కాంతాల శక్తి తరంగాలను అనుసంధానము చేస్తే మెరుపు కాంతి ఏర్పడుతుందని దానిని వడిసి పట్టుకొనే డ్యోర్జీ అనే వజ్రాయుధ నిర్మాణ పరికరము చేయడము జరిగినది.నిజానికి ఈ మూడు మణుల యొక్క ఉద్దేశ్యము మనలో ఙ్ఞాన,క్రియ,ఇచ్ఛా శక్తులు కలిగిస్తాయి.ఇదే విషయాన్ని   ఆయన మనకి మూడు సూక్తుల రూపములో అనగా

బుద్ధం శరణం గచ్చామి

ధర్మం శరణం గచ్చామి

సంఘం శరణం గచ్చామి

అని చెప్పడము జరిగినది.ఇందులో మొదటి పంక్తి

బుద్ధం శరణం గచ్చామి

అంటే మన అవివేక బుద్ధి కాస్త వివేక బుద్ధిగా మారడము అనేది ఙ్ఞానశక్తి అవుతుంది.అనగా బుద్ధి కాస్త బుద్ధం అవుతుంది.దీనికి సంకేత మణియే చింతామణి.ఇది మన మెదడు మధ్యభాగములో ఉన్న పిట్యూటరి గ్రంధియే అన్నమాట.ఇదియే మన శరీర చింతామణి. రెండవ పంక్తి అయిన

ధర్మం శరణం గచ్చామి

అంటే జీవుడు ఎపుడు ధర్మ గుణముతో ధర్మ సంపాదన,పాతివ్రత్య ధర్మముతో ధార్మిక జీవితమును అనుభవించాలని చెప్పడము జరుగుతుంది.అంటే క్రియాశక్తి అన్నమాట.మన హృదయము ధర్మయుతముగా ఉంటే మన మనస్సు చేసే ఆలోచనలు, భావాలు, కర్మలు, క్రియలు, సంకల్పాలు, స్పందనలు అన్ని గూడ ధర్మముగా ఉంటాయి.దీనికి సంకేతమే రుద్ర మణి.ఇది మన హృదయ భాగములో ఉండే హృదయ గ్రంధియే మన శరీర రుద్రమణి అన్నమాట.ఇక మూడవ పంక్తి అయిన

సంఘం శరణం గచ్చామి

అంటే మనవంతుగా సంఘానికి హాని కలగకుండా, ప్రపంచానికి హాని చేయకుండా మంచి చేయడమే దీని ఉద్దేశ్యము.సంఘము బాగుంటే మనము బాగుంటాము.ఇదియే ఇచ్ఛాశక్తి అవుతుంది.సంఘము బాగుండాలంటే మనము ఎపుడు నిష్కామ కర్మ అనగా స్వార్ధము లేకుండా ప్రతిఫలము ఆశించకుండా ఫలితము గమనించకుండా పని చేయాలి.కర్మ చేయాలి.దీనికి సంకేతమే నాగమణి.ఇది మన శరీరములో థైరాయిడ్ గ్రంధియే శరీర నాగమణి అంటారు.ఈ గ్రంధియే మనకి వివేక లేదా అవివేక ఙ్ఞానమును ప్రసాదించగలదు.ఇది ఇచ్చే హార్మోన్స్ బాలెన్స్ బట్టి మన ఙ్ఞాన ధర్మము ఆధారపడి ఉంటుంది.

నిజానికి హిమాలయాలలో ఉండే ఈ మణులు మన దేహాలయములో ఉండే మూడు గ్రంధులు అని బుద్ధుడు తన ధ్యాన ప్రత్యక్ష అనుభవాలతో తెలుసుకోవడముతో తన బౌద్ధ ధర్మానికి మూల గురు మంత్రముగా

 ఓం-మణి-పద్మ-హుం

అని చెప్పి ప్రచారము చేయడము జరిగింది.అదే హైందవ ధర్మములో వీటినే ధర్మ,అర్ధ,కామాలుగా చెబితే మన బుద్ధుడు ఇలా చెప్పడము జరిగింది.

నిర్వాణలామా.చాలా చక్కగా చెప్పావు.ఇంతవరకు బాగానే ఉంది.మన బుద్ధుడు మనిషికి కష్టాలకి కారణము కోరికయని తెలుసుకొని కోరిక లేని సమాజము చూడాలనే కోరికతో సాధన చేయడములో అంతరార్ధము ఏమిటి?”

స్వామి.కోరిక వలన కష్ట నష్టాలు, సుఖాలు కలుగుతాయని ఆయన మొదట తెలుసుకున్నారు.ఆ తరవాత అసలు కోరిక లేని స్థితి పొందితే సరిపోతుంది గదాయని రెండవ సారి అనుకున్నాడు.కోరిక లేని స్థితి అంటే మనస్సు లేని స్థితియే గదా.ఇది పొందాలంటే మంచి సమాధి స్థితి పొందాలి.ఇదియే నిర్వాణ పధమవుతుంది.ఈ స్థితి కోసమే ఆయన కోరికగా పెట్టుకొని మళ్ళీ సాధన కొనసాగించాడు.చివరికి ఈ కోరిక భావము లేని స్థితికి సాధకుడు సహజసిద్ధముగానే మౌనముగా, ధర్మయుతముగా మనస్సు,భావము లేకుండా చేరుకోవాలని తెలుసుకున్నాడు.

కులకర్ణి ఆనందముతో నిర్వాణలామా.మీకు హిమాలయాలలో ఉన్నదో లేదో తెలియని రహస్య గ్రామాలకి వెళ్ళే అర్హత,యోగ్యత నీకు పుష్కలంగా ఉన్నాయని నాకు అనిపిస్తోంది అనగానే

స్వామీ.ఇదంతా మన బుద్ధ భగవానుడి దయ,అనుగ్రహబలము వలనే సాద్యపడింది.నాదొక విన్నపము.అది ఏమిటంటే   టిబెట్ ప్రాంతములో బౌద్ధ ధర్మశాలయందు నా భార్యకి వైద్యము జరుగుతోంది.ఆమెకి చింతామణి తీర్ధము త్రాగిస్తే గాని మామూలు స్థితి రాదని ఒక నాగ సాధువు నాకు చెప్పడము జరిగింది.కాబట్టి మీ అధికారాలతో నాకు నా భార్యను ఇక్కడికి రప్పిస్తే అలాగే నేను చేసిన ప్రయోగ వస్తువు పరికరమును గూడ తెప్పిస్తే మరియు మా బృందానికి హిమాలయాలలో స్వేచ్చగా సంచరించడానికి గావలసిన అర్హత పత్రాలు మీరు ఇప్పించాలి.అనగానే

కులకర్ణి వెంటనే నిర్వాణలామా.అదేమి పెద్ద కష్టము గాదు.నీకు కావలసిన ఏర్పాట్లు వారం రోజులలో చేయగలను.అలాగే మీకు కావలసిన అర్హత పత్రాలు గూడ తెప్పించగలను.కాని నాకు ఒక విషయము అర్ధము గాలేదు.అది ఏదో సైన్స్ ప్రయోగ పరికరము అన్నావు.అది ఏమిటది అని అడుగుతుండగా అక్కడికి జేసి అలాగే థామస్ వచ్చారు.

ఈయన అడిగిన ప్రశ్న విని సార్.ఆ సైన్స్ పరికరము గూర్చి నేను మీకు చెబుతాను.అది  ఏమిటంటే మన నిర్వాణలామాగారు సన్యాసదీక్ష తీసుకోక ముందు ఒక గొప్ప విఙ్ఞాన శాస్త్రవేత్త.ఈయన మన భూలోకము లాంటి సమాంతర లోకాలు ఈ విశ్వములో ఎక్కడో ఒకచోట ఉండే ఉంటాయని ఇదే హైందవ ధర్మములో బ్రహ్మాండ పురాణము నందు 14 లోకాలున్నాయని చెప్పిన వాదన ప్రకారము ఈయన పరిశోధన చేసి ఆయా లోకాల ఉనికి ఎక్కడ ఉన్నాయో ఒక పరికరమును తయారుచేసి తెలుసుకున్నారు.కాని ఆయా లోకాలకి వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఈ పరికరమును ఆపరేటింగ్ చేయాల్చి రావడముతో ఈయన వెళ్ళలేకపోయాడు.ఎవరైనా వెళ్ళే వారికోసము ఎదురు చూస్తున్నారు.ఈ అవకాశము మేమిద్దరము తీసుకోవాలని అనుకుంటున్నాము అనగానే

కులకర్ణికి అర్ధము కానట్లుగా ముఖము పెట్టేసరికి

సార్.మా నాన్న గారు ఈ అంతరిక్షములో ఎక్కడో ఒకచోట సమాంతర ప్రపంచములో ఉండి ఉంటారు.ఇదే విషయాన్ని మన నిర్వాణలామాని అడిగితే మీ నాన్నగారు కోరికతో చనిపోవడము వలన పితృలోకము నందు ఉండే అవకాశాలు ఉన్నాయని ఈ లోకమునకు వెళ్ళుటకు తను తయారు చేసిన పరికరము ఉపయోగపడుతుందని చెప్పడముతో ఆయన ప్రయోగానికి మేము ఓకే చెప్పడము జరిగినది.అందువలన మేమిద్దరము గూడ ప్రస్తుత ఉద్యోగాలకి రాజీనామా ఇచ్చి ఈయనతో పాటుగా హిమాలయాలలోని ఏదైనా కొండ మీద ఈ పరికరమును ఉపయోగించుకొని మన సమాంతర లోక ప్రపంచమైన పితృలోకానికి వెళ్ళి మా నాన్న గారిని కలవాలని అనుకుంటున్నాము అంటూ తమ రాజీనామా పత్రాలు కాస్త ఈయన చేతికి ఇవ్వగానే..

కులకర్ణికి ఏమి మాట్లాడాలో అర్ధముగాక వీళ్ళ అందరి వైపు అదోలా చూస్తూ ఎవరి పిచ్చి వారికి ఆనందము అంటూ ఒక వైరాగ్యపు నవ్వు నవ్వి అందరికి వీడ్కోలు చెబుతూ వేదాంతికి వేపకాయ వెర్రి ఉంటుందని అనే నానుడి నిజమేనని మనస్సులో అనుకుంటూ మౌనముగా అక్కడనుండి వెళ్ళిపోయాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి