03 భాగం

 

03

నా చంద్ర ముఖ బింబమును చూసిన మా అమ్మకునేను 5 వ నెల గర్భములో ఉన్నప్పుడు తను కన్న ఒక దివ్యమైన కల జ్ఞాపకము వచ్చింది.

         అది ఏమిటంటే తెల్లవారుజామున బ్రహ్మీముహూర్త కాల సమయములో ఆరు దంతాలుండి దాని తొండములో ఒక అయిదు రేకులున్న పద్మమును పట్టుకొని తెల్లని చర్మకాంతితో బలముగా, అందముగా, రాజఠీవిగా ఉన్న ఒక తెల్లని ఏనుగు కాస్త సరాసరి తన దగ్గరికి వచ్చి... తన గర్భము మీద తను తెచ్చిన పద్మము నుంచి అమ్మ వైపు నమస్కార వందనముతో చూస్తూ తనుగూడ పద్మముతో సహా అమ్మ గర్భమునందు ప్రవేశించే దృశ్యము ఒక అద్భుత కలగా వచ్చింది. దానితో మా అమ్మకి తన కాన్పు విషయములో ఎలాంటి కష్టాలు, బాధలు, భయాలు ఉండవని, సుఖ ప్రసవము అవుతుందని గ్రహించి విపరీత ఆనందమునకు గురియై ప్రక్కనే నిద్రపోతున్న మా తండ్రి గారిని నిద్రలేపి తనకి వచ్చిన కల గూర్చి ఆనందముగా వివరించినది. దానితో ఈయన ఆశ్చర్యానందాలకి గురియై మరునాడు కల్లా మా రాజ్యములో ఉన్న ప్రముఖ జ్యోతిష్య పండితులను మా ఆస్థానమునకు రమ్మని ఆహ్వానాలు పంపించినారు. ఆ నగర మహారాజు ఆహ్వానము అందుకోవడమే మహాభాగ్యమని ఆ జ్యోతిష్య పండితులు మా ఆస్థానమునకు చేరుకోవడము అలాగే మా అమ్మకి వచ్చిన స్వప్న వృత్తాంతము వివరాలు తెలుసుకొని.... ఈ స్వప్న సమయమును , లగ్న సమయముగా తీసుకొని జాతక ప్రశ్న చక్రము గీసి... అందున్న నవగ్రహాల 12 గదులలో ఉన్నవాటి స్థితిగతులను బట్టి వారు పొందిన జ్యోతిష్య అనుభవ జ్ఞానముతో... మా తల్లిదండ్రులని  ఉద్దేశిస్తూ "ప్రభూ. మహారాణి మాయాదేవి ఈ  భూమండలమును పరిపాలించగల కారణజన్ముడికి జన్మ నివ్వనున్నారు. తన జ్ఞానముతో ఈ లోకానికి ఉత్తమోత్త జ్ఞాన గురువు.... బోధ గురువు అవ్వక తప్పదు. మహా తపస్సు శాలియై తను పొందిన జ్ఞాన అనుభవాలతో ఇప్పుడున్న దైవ సిద్ధాంతాలను ఖండించి తను సరికొత్త సిద్ధాంతమునకు నాంది అవ్వటానికి మూల పురుషుడవ్వక తప్పదు అని అనగానే మా నాన్నగారి ముఖములో ఆనందము  తాండవిస్తున్నా ఏదో తెలియని విషాధఛాయ కల్గడము మా అమ్మ గమనించింది. ఇదియే ఆనాటి స్వప్న వృత్తాంతము.

     నేను పుట్టినానని మా నాన్నగారు తెలుసుకొని ఆనందముతో ప్రయాణమై నేను ఉన్న చోటుకి లుంబిని వనమునకు వచ్చి పట్టువస్త్రాలతో యున్న నన్ను చూసి పరవశమై పరమానందపడుతూ నన్ను ఆప్యాయముగా మురిపెంగా చూడగా... నేను కాస్త ఆయనకి ధ్యాననిష్ఠలో ఉన్న ఒక బాలయోగి గా లీలా మాత్రముగా కనిపించేసరికి ఆయన కంట తడిపెట్టటం ఎవరు గమనించలేదు. ఎందుకంటే ఆనందము వేసిన... బాధ వేసిన కన్నీళ్లే వస్తాయి గదా. దానితో మా అమ్మ పుట్టినిల్లు అయిన రామ గ్రామము వెళ్లకుండా నేను కాస్త మా కుటుంబ పరివారముతో తిరిగి కపిలవస్తు  పురమునకు తిరుగు ప్రయాణము మొదలైంది.

 

*** *** *** *** *** ***



అంగుళీమాల...

ఇతను బౌద్ధ మహాయాన శాఖ బౌద్ధ సన్యాసి.ఈ మత తాంత్రిక విద్యయందు ఆరితేరిన ఘనాపాటి.పైగా ఈ విద్యతో జనాలను హింసించడం వాళ్ళు భాధపడుతుంటే విపరీతముగా అనందించే సైకో కిల్లర్ అన్నమాట.వీడికి బౌద్ధ మత సన్యాసులు అన్న బౌద్ధ భిక్షువులు అన్న ఎందుకో తెలియని తీవ్ర ఆవేశాలకు గురియై సైకోగా మారిపోతాడు.ఇలాంటి వారిని చంపడము అంటే వీడికి చాలా ఇష్టమైన హత్య క్రీడ అన్నమాట.గాకపోతే వీడికున్న పేరుకి మరియు సైకో బుద్ధి తగ్గట్లుగా వీడు ఎవరినైతే చంపుతాడో వారి బొటనవ్రేలును తీసుకొని తన రహస్యగదిలోని జాడీలలో భద్రపరచుకొని వాటిని చూస్తూ విపరీత ఉద్రేకమును పొందడము వీడికి అలవాటు.దానితో వీడిని గూర్చి తెలిసినవారు అందరు గూడ వీడి అసలు పేరు మర్చిపోయి బొటనవ్రేలులు సేకరించే గుణముండుట వలన వీడిని అంగుళీమాల అని పిలవడము జరుగుతుండేది. దానికి వీడు ఈ పేరును చూసి తను బుద్ధుడి కాలము నాటి అంగుళీమాలగా అనుకోవడముగా గూడ సైకోగా ఆనందము పొందుతూ ఉంటాడు.ఈ వికృత ఆనందము కోసం హత్యలు చేస్తూ తనలోని రక్త పిపాస సైకోను శాంతిపరుస్తుంటాడు.ఇలాంటి ఆనంద స్థితి అంబేద్కర్ అనే బౌద్ధ సన్యాసిని మ్యూజియము దాకా వెంటాడి వేటాడి చంపినపుడు కలిగినది అనుకుంటూ తను ఎలా ఈ హత్యను చేశాడో గుర్తు చేసుకోవడము మొదలపెట్టాడు.

తన గురువైన దేవదత్త నుండి ఒకసారి ఫోన్ కాల్ వచ్చి

అంబేద్కర్ అనే బౌద్ధ సన్యాసి దగ్గర ఏదో మణికి సంబంధించిన రహస్యమున్నదని..అది తెలుసుకోవాలని వాడు చెప్పకపోతే చంపివేయమని ఆఙ్ఞ ఇవ్వడంతో

ఇలాంటి రక్తసిక్త హత్య చేసి చాలా రోజులు అవ్వడంతో అంగుళీమాల ఎగిరిగంతేసినాడు.

అంబేద్కర్ ఉండే ఇంటి పరిసరాలకు అంగుళీమాల చేరుకున్నాడు.ఇంటి బయట కాపలాదారుడు కనిపించేసరికి..ఇంటి వెనుక గోడ ద్వారా లోపలికి అంగుళీమాల ప్రవేశించి చడిచప్పుడు లేకుండా ఇంటికున్న నీటి పైపును పట్టుకొని టెర్రస్ పైకి ఎక్కి పెంట్ హౌస్ గదికి వెళ్ళి అక్కడ నుండి లోపలికి ఉన్న మెట్ల ద్వారా అంబేద్కర్ ఉన్న గది తలుపు దగ్గరకి రహస్యముగా చేరుకోవడము జరిగినది.నెమ్మదిగా తలుపు నెట్టి చూడగా.. అంబేద్కర్ ఏవో కాగితాల మీద స్టడీ టేబుల్ లైట్ కాంతి వెలుగులో రాసుకుంటూ కనిపించేసరికి నెమ్మదిగా అడుగుల శబ్దము గూడ వినిపించకుండా పిల్లి నడకతో అంగుళీమాల ఈయన వెనక్కి వెళ్ళి మెడ మీద బలముగా కొట్టి కొట్టగానే అంబేద్కర్ కి ఏమి జరిగినదో అర్ధము అయ్యేలోపల స్పృహ తప్పిపడిపోవడము వెంటనే అంగుళీమాల  తను తెచ్చుకున్న బ్యాగులోంచి సెల్ టేప్ బయటకి తీసి అంబేద్కర్ నోటికి అంటించి..కాళ్ళు చేతులను బలమైన వైరులతో బంధించి స్పృహ తప్పిన అతడిని భుజము మీద ఎక్కించుకొని వెనుక ద్వారము గుండా బయటికి వచ్చి గోడ అవతలకి ఇతనిని నెమ్మదిగా పడవేసి తను దిగి మళ్ళీ ఇతనిని ఎత్తుకొని తన కారులో ఎక్కించుకొని తన రహస్యగది ఉన్న వైపు అంగుళీమాల తన కారును శరవేగముగా పోనిచ్చాడు.ఇంతలో రోడ్డు మీద ఉన్న ఇతర వాహన శబ్దాలకి అంబేద్కర్ కి మెలుకవ వచ్చి తను బంధియై కారులో ఉన్నానని తెలుసుకొని మాట్లాడటానికి నోటికి ఉన్న ప్లాస్టర్ అడ్డు రావడము ఏమీ చేయలేక మౌనవేదనగా చూస్తూ ఉండిపోయినాడు.కారు ఒక చోట ఆగడము వాడు తనని ఎత్తుకొని తీసుకొని ఒక గదిలో కుర్చీలో కూర్చొపెట్టి బంధించడము అంతా గూడా కళ్ళు మూసుకున్న అంబేద్కర్ గమనిస్తున్నాడు.

అంబేద్కర్ కి మెలుకువ వచ్చినదని అంగుళీమాల తెలుసుకొని

సార్.మీ దగ్గర మా గురువుకి కావలసిన మణి శోధన రహస్యము ఉన్నదని అది తెలుసుకోమని నాకు చెప్పినారు.మర్యాదగా అది ఏమిటో చెప్పండి.లేదంటే మీ ప్రాణాలు గాలిలో కలసిపోతాయి

అసలు నువ్వు ఎవరు?నీ గురువు ఎవరు? నాకు ఎలాంటి మణి రహస్యాలు తెలియవు. ఎవరినో అనుకొని పొరబాటున నన్ను బంధించి తెచ్చావు.

సార్. నా వృత్తిధర్మములో నేను ఎప్పుడు పొరబాటు చేయను.మీరే ఆ వ్యక్తి అని నాకు తెలుసు. నా పేరు అలాగే మా గురువుగారి పేరు మీకెందుకు?నాకు కావలసిన సమాచారము ఇస్తే చాలు.

అంటే నన్ను బెదిరిస్తున్నావా? నన్ను చంపిన ఆ మణి విషయము నీకు చెప్పను.

అంటే ఆ మణి విషయము మీకు ఖచ్చితముగా తెలుసు అన్నమాట.మామూలుగా చెపితే ఎందుకు వింటారు.నాలో సైకో బయటకి వస్తేగాని మీరు బయటపడరు.నిజము చెప్పరు అంటూ...

అంబేద్కర్ ఎడమ చేతి బొటనవ్రేలును  ఆప్యాయముగా నొక్కుతూ ఆ స్పర్శ ఆనందమును మురిపెంగా పొందుతూ తన జేబులో నుంచి ఒక చిన్న చురకత్తిని బయటకి తీసి నెమ్మది నెమ్మదిగా ఈ బొటనవ్రేలు కోస్తుండేసరికి వీడిలో ఆనందము  కలుగుతుండగా అంబేద్కర్ ఆవేదన కల్గి భరించలేక విపరీతముగా అరుపులు అరుస్తున్న కొద్ది అంగుళీమాలలో సైకో మరింతగా రెచ్చిపోయి బొటనవ్రేలును పూర్తిగా ఖండించి ఆ వ్రేలును మురిపెంగా చూస్తూ తన్మయత్వమును పొందుతూ స్పృహ తప్పి పడిపోవడముతో….

ఇదంతా గమనించిన అంబేద్కర్ వెంటనే బాధను దిగమ్రింగి తనని బంధించిన కట్ల నుండి విముక్తి పొందటానికి విశ్వ ప్రయత్నాలు చేసి  బంధ విముక్తుడై ఆ గది నుండి బయటకి పారిపోతుండగా బూట్లు చేసే పెద్ద శబ్దాలకి అంగుళీమాలకి మెలకువ వచ్చి చూసేసరికి తన ఎదురుగా ఖాళీ కుర్చీ దర్శనమిచ్చేసరికి ఆవేశముతో టేబుల్ లోపల ఉన్న తుపాకిని తీసుకొని శరవేగముతో బయటకి పరుగు తీసేసరికి అప్పటికే అంబేద్కర్ చాలా దూరము వెళ్ళిపోయినాడని గ్రహించి అక్కడక్కడ పడిన చేతి రక్త మరకలు ఆధారముగా ఈ దారి బౌద్ధ మ్యూజియము వైపుకి వెళ్ళుతుందని అంగుళీమాల తెలుసుకొని బైక్ మీద శరవేగముతో అటువైపు పోనిచ్చాడు. 

అంగుళీమాల ఈ మ్యూజియము చేరుకొనేసరికి మెట్లు ఎక్కుతూ లోపలికి వెళ్ళుతున్న అంబేద్కర్ కనిపించేసరికి వికృత చిరునవ్వుతో శరవేగముగా ఇతనిని అనుసరించడము అంబేద్కర్ వీడిని చూసి అమిత భయముతో శరవేగముగా మ్యూజియములోకి వెళ్ళి బుద్ధుడి ఫోటోలు ఉన్న గదిలోకి వెళ్ళి గ్రిల్స్ ఉన్న గది తలుపులు వేస్తుండేసరికి అంగుళీమాల అతడిని సమీపించిన ఎలాంటి ఉపయోగము లేకపోయినది.ఎందుకంటే అప్పటికే గ్రిల్స్ కి అంబేద్కర్ బలమైన తాళము వేశాడు.దానితో అంగుళీమాలలో తెలియని పిచ్చి ఆవేశము కల్గి తుపాకితో అంబేద్కర్ గుండెల మీద గురిపెడుతుండగా అంబేద్కర్ దీనికి ఏమాత్రము భయపడకుండా తన చేతిలో ఉన్న కత్తితో ఒక డైమండ్ గుర్తు అలాగే త్రికోణ గుర్తు గాయాలతో గీసుకొని విపరీతమైన రక్త స్రావము రావడంతో అప్పటికే మూడు రోజుల నుండి ఎలాంటి ఆహారము తినకపోయేసరికి విపరీతముగా నీరసము వచ్చి నేలమీద పడి స్పృహ కోల్పోయి ప్రాణాలు వదలడము ఏకకాలములో జరిగింది.దానితో అంగుళీమాల తుపాకిని కాల్చకుండా ఆవేశముతో వెనుతిరిగి తన గదికి రావడము జరిగినది.

 ఇలాంటి క్రూరుడికి ఒక ఫోన్ కాల్ రావడంతో దానిని అందుకొని అది తన గురువైన దేవదత్త  అని తెలుసుకొని

స్వామి.చెప్పండి. మీరు చెప్పినట్లుగా మ్యూజియం వద్ద ఆ బౌద్ధ సన్యాసిని చంపి వచ్చాను. వాడి బ్రొటనవ్రేలు ఉంచుకున్నాను అనగానే..

"అంగుళీ.నేను చెప్పినట్లుగానే చేశావు.కాని వాడు చనిపోయేముందు ఏదో గుర్తును తన గుండెల మీద కత్తి గాయముతో గీసుకున్నాడని...చేతిలో ఏదో ఒక తాళం చెవి పెట్టుకొని చనిపోయినాడని నాకు ఇప్పుడే సమాచారము అందినది.నువ్వు వెంటనే ఆ శవమును నీ మంత్రశక్తితో నాశనము చేసిరా. లేదా వాడి చేతిలో ఉన్న తాళం తీసుకొనిరా.వాడు మనకి మణి రహస్యము చెప్పకుండా ఎటూ చచ్చాడు.వాడు మనకు మిగిల్చిన ఆధారముతో అయినా మనకు మణి వెతికే అవకాశముండొచ్చుకదా.నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళిరా" అని ఫోన్ కట్ చేయగానే..

అంగుళీమాల వెంటనే భూగర్భ రహస్య గది నుండి పైకి వచ్చి..గోడకి ఉన్న బైకు తాళాలు తీసుకొని గదినుండి బయటికి వచ్చి బైకు ఎక్కి తను హత్య చేసిన మ్యూజియము వైపుకు శరవేగముతో బయలుదేరాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి