25 భాగం

 

25

నేను కాస్త మౌనముగా అరణ్యములోనికి వెళ్తుండగా... నాకు ఒక చోట కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసి కనిపించాడు. కాని విచిత్రముగా ఇతని చేతిలో విల్లు, బాణాలు ఉండటము గమనించి నేను వారితో...

మీరు సన్యాసులా? లేదా వేటగాడా?” అని అడిగాను.

అయ్యా. నేను సన్యాసి వేషములో ఉన్న వేటగాడిని. ఎందుకంటే ఈ వేషములో ఉన్నవాడికి అడవి జంతువులు భయపడవు. దానితో నా వేట తేలిక అవుతుంది అనగానే....అంటే కాషాయము మాటున ఇంత మోసమా అని నాకు ఆశ్చర్యమేసింది.

నేను వెంటనే వాడితో..కపట వేషధారి. నీ దుస్తులు నాకు ఇయ్యి. నా దుస్తులు నీకు ఇస్తాను అనగానే...

నా రాజ దుస్తులను చూసి వాడు ఆశపడి దానికి వాడు సరేనని తల ఊపడముతో నా రాజ దుస్తులు తీస్తుండగా....దీని లోపల ఏదో హారమున్నట్లుగా నాకు అన్పించగా దానిని బయటికి తీస్తే.... అది రత్నాల హారమని తెలుసుకున్నాను. దీనిని చూడగానే ఆ కపటవేషధారి ఆనందమునకు అంతులేకుండా పోయింది. వాడి ముఖములోని ఆనంద వెలుగులు నేను చూడగానే.... నాకు తెలియని ఆనందమేసింది. ఎందుకంటే నా ఆనందక్షణాలు ఎదుటి వాడి ఆనందములోనే ఉంటుంది గదా. వాడికి ఈ హారము అలాగే నా రాజ దుస్తులు ఇస్తూండగానే....

స్వామి. ఇంత విలువైన హారమును నాకు ఇస్తున్నారా?”

నాయనా. నిజమైన సన్యాసికి మట్టియైన,మణియైన ఒక్కటే. వీటి తేడాలు కాని విలువలుకాని, ధరలు కాని పట్టవు అనగానే....

అంటే మీరు నాకులాగా వేటకి రాలేదా?”

వేటకే వచ్చాను. నీవేట వేరు. నా వేట వేరు. సత్యాన్ని,జ్ఞానాన్ని వేటాడాలని వచ్చాను. కాబట్టి నీ సన్యాసి దుస్తులు నాకివ్వు. వీటితో నా సన్యాసదీక్ష మొదలవుతుంది.

వాటిని తీసుకొని ధరించి ఒక చెట్టు నీడ క్రింద ధ్యానములో ఉండిపోయాను.

*** *** *** *** *** ***

ఇంతలో జేసి ఇంటి దగ్గర ఉన్న కులకర్ణికి ఫోన్ వస్తే దానిని ఎత్తగానే

సార్.మన బుద్ధ గయ క్షేత్రములో చచ్చిపోయిన సన్యాసిలాంటి హత్యలాగానే కాశీక్షేత్రములో ఒక లేడి ఆఫీసర్ చంపబడినదని సమాచారము అందినది అనగానే

అయితే ఈ రెండు హత్యలు ఒకటే అని ఎలా? తెలుసుకున్నారు అనగానే

సార్.ఈ రెండు హత్యలలో కామన్ పాయింట్ గా ఎడమ చేతి బొటనవ్రేళ్ళు మిస్ అయినాయి.అంటే ఈ రెండిటిని ఒకే వ్యక్తి హత్య చేసి ఉంటాడని మన వాళ్ళ అనుమానము.పైగా ఈమె హత్యకు ముందు చివరిసారిగా ఒక బౌద్ధ సన్యాసితో మాట్లాడినట్టుగా అక్కడ సి.సి కెమెరాలలో రికార్డ్ అయినదని కాని అది సాక్ష్యము లేకుండా అక్కడున్న లంచ పోలీసులు చేశారని మా పరిశోధనలో తేలినది అనగానే

అంటే ఈ రెండు హత్యలు గూడ దేవదత్త తొత్తు అయిన బౌద్ధ సన్యాసి అంగుళీమాల చేస్తున్నాడని అనుకోవచ్చునా?”

సార్.ఖచ్చితముగా అనుమానించవచ్చును. అనుకోవచ్చును అనగానే

అంటే మీ దృష్టిలో ఇపుడు వాడు కాశీ క్షేత్రములో ఉండి ఉంటాడా?”

ఈ హత్య జరిగింది వాడి చేతిలోనే అని ఖచ్చితముగా తెలుస్తోంది.కాని ఈ హత్య చేసిన వెంటనే వాడు కాశీ నుండి పారిపోవచ్చు లేదా గుప్తముగా ఎవరికి కనబడకుండా జాగ్రత్తలు తీసుకొని ఉండవచ్చును.ఏ విషయము చెప్పలేము.

మంచిది.ఇంక ఈ హత్య గూర్చిన వివరాలు తెలిస్తే నాకు తెలియజేయి అంటూ

కులకర్ణి ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న త్రివేదికేసి అదోలా చూస్తూ

త్రివేది.ఇక్కడ హత్య జరిగినట్లుగా కాశీ క్షేత్రములో ఒక లేడి ఆఫీసర్ హత్య జరిగినదని అక్కడ ఆమె బొటనవ్రేలు మిస్ అయినదని ఒకవేళ ఈ హత్యను గూడ అంగుళీమాలయే చేశాడని మనవాళ్ళ పరిశోధనలో తేలింది

.సార్.అంటే వాడు ఇపుడు కాశీలో ఉన్నాడా?”

త్రివేది.ఉన్నాడని అనుకోక తప్పదు. 

సార్.వాడికి ఈ కాశీక్షేత్రములో ఏమి పని?అలాగే ఆవిడని చంపవలసిన అవసరము ఏముంది?”

త్రివేది.ఏముంది.ఏవో ఆధారము కోసము అక్కడున్న బౌద్ధ మ్యూజియముకు వెళ్ళి ఉంటాడు.వాడికి కావలసిన సమాచారము లేదా వస్తువు ఆమె ఇచ్చి ఉండక పోవచ్చును.దానితో వీడిలో ఉన్న సైకో నిద్ర లేచి ఆమెను శాశ్వత నిద్రలోకి పంపించి ఉంటాడు అంటూండగానే..

మరొకసారి కులకర్ణి ఫోన్ మోగగానే

సార్.మన జేసి మేడమ్ కారు ఇంటికి ఒక కి.మీ. దూరములో ఆపి పారిపోయారట.అందులోంచి నలుగురు వ్యక్తులు దిగారుట.అనగానే..

అదేమిటి?ఆ కారులో ఉన్నది ముగ్గురు వ్యక్తులే గదా.మరి ఈ నాలుగవ వాడు ఎవడు?”అనగానే

మనము అమర్చిన సి.సి.కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యమును చూసిన కొంతమంది పోలీసులు ఆ నాలుగవ వ్యక్తి గంజాయి అమ్మే గంజాయి స్వామి అంటున్నారు అని చెప్పగానే

మళ్ళీ వీడు ఎవడు?ఉన్నవాళ్ళని పట్టుకోలేక చస్తుంటే.

సార్.వీడు క్రొత్తవాడు కాదు.పాతవాడే.కాని వీడు మన వాళ్ళతో అదే జేసి మేడంతో ఎందుకు కలిశాడో ఎవరికి అర్ధము కాలేదు.

సరే.వాడి సంగతి వదిలేయండి.కారులో ఏమైనా ఆధారాలు ఉన్నాయేమోనని చూశారా?”

సార్.కారు అద్దాలు తీయడానికి లేని విధముగా ఉంది.కాని కారు వెనుక ఉన్న అద్దముపైన ఒక త్రిశూలము మీద గుడి బొమ్మ గీసిన కాగితము మన వాళ్ళు చూశారు.దానిని మీకు పంపిస్తాను.మాకు ఎవరికి అది ఏమిటో అర్ధముగాలేదు.ఒకవేళ మీకు అర్ధము అవుతుందని అనుకుంటున్నాము.

అయితే వెంటనే దానిని నాకు పంపించండి.

అని చెప్పిన రెండు నిమిషాలకు ఈ గుర్తు వచ్చినది.

దీనిని చూస్తున్న కులకర్ణి నొసలు ముడిపడుతుండగా ఏదో అనుమానము వచ్చిన

త్రివేది వెంటనే కులకర్ణి ఫోన్ లో ఉన్న గుర్తును గుర్తుపట్టి

సార్ ఈ గుర్తు కాశీ క్షేత్రానికి గుర్తు.ఎందుకంటే ఈ విశ్వమంతా జలప్రళయముతో నిండిపోయిన కాశీక్షేత్రము మాత్రము త్రిశూలము మీద ఉంచి కాశీ విశ్వనాధుడు రక్షిస్తాడని కాశీ ఖండ పురాణము వచనమని టి.వి.లో ఒకసారి విన్నాను.ఈ గుర్తు చూస్తుంటే నాకు అదే గుర్తుకు వచ్చింది అనగానే

అంటే నిర్వాణలామా బృందము అలాగే అంగుళీమాల కాశీక్షేత్రమునకు గురి పెట్టినారు.వీళ్ళ ఆధారాలు ఈ క్షేత్రానికి దారితీసి ఉండి ఉంటాయి.ఇపుడు మనము కాశీక్షేత్రానికి వేళ్ళేలోపల వాళ్ళు అక్కడ నుండి మరో ఆధారము ద్వారా మరో చోటుకి వెళ్ళే  అవకాశాలు ఉన్నాయి.కాబట్టి వీళ్ళని కాశీకి వెళ్ళకుండా చేయాలి లేదా కాశీక్షేత్రములో మన వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళని అనుసరించమని ఆఙ్ఞ ఇవ్వాలని కులకర్ణి మనస్సులో అనుకొని ఆ విధముగా చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి