09 భాగం

 

09

సిద్ధార్థుడు ఒకసారి బలముగా ఏదైనా నిర్ణయమును  తీసుకున్నాడంటే వాడిని మార్చడం... ఏమార్చడం ఎవరి తరము గాదని మా నాన్నగారికి బాగా తెలియడముతో మా నగరములోని వేద పండితులను పిలవటానికి పురమాయించారు.

కొంతమంది వేద పండితులు నాకు వేదాలు నేర్పించడానికి ధిక్కరించారు. మరికొంతమంది మహారాజు వేసే దండనలకి భయపడి అలాగే మరికొందరు మా నాన్నగారు ఇచ్చే బహుమానాలకు కక్కుర్తిపడి నాకు వేదాలు నేర్పించడానికి ఇష్టత చూపారు. ఏది ఏమైతేనే నాకు వేదజ్ఞానం నా తొమ్మిదవ యేట నుండి మొదలై 29 వ సంవత్సరము దాకా కొనసాగింది. ఒక ప్రక్క వేదవిద్య పారాయణాలు మరో ప్రక్క యుద్ధ విద్య ప్రావీణ్య ప్రదర్శనలు ఇంకొక ప్రక్క ఎవరికీ తెలియకుండా రహస్యముగా నా ధ్యానమును కొనసాగించడము నా దినచర్య భాగాలైనాయి. కానీ నేను కాస్త వేదాలు నేర్చుకోవడానికి ఇష్టము చూపిన మా నాన్నగారు నేను ధ్యాననిష్ఠలో ఉంటే మాత్రము తట్టుకొనేవారు కాదు. ఏదో తెలియని కోపావేశానికి గురై నా ధ్యాననిష్ఠకి ఎలాగైనా భంగము కలిగించేవారు. వారి చేష్ఠలు మౌనముగా చూస్తూ మా అమ్మ ఉండిపోయేది. కానీ నా ధ్యాన నిష్ఠను చూసి మా అమ్మ మాత్రము నా జన్మను సార్ధకతను చేసుకుంటున్నానని... ఎప్పుడికైనా యోగ సిద్ధుడవుతానని బ్రహ్మానందముతో ఉండిపోయేది. బయటికి మాత్రము మా నాన్నగారికి వంతుపాట  పాడేది. ఎవరికి తెలియకుండా నా ధ్యానానుభవాలు నన్ను అడిగి తెలుసుకొని సంబరపడుతుండేది.

       కాలము ఎప్పుడు ఒకే విధంగా ఉండదు గదా. మా నాన్నగారికి నేను ధ్యానము నందు రోజులో సగ భాగము పైన ఉండిపోతున్నానని సమాచారము అందసాగింది. దానితో నేను కాస్త జ్యోతిష్య పండితులు చెప్పినట్లుగా తపస్విగా మారిపోతున్నానేమోనని లేదా అన్నింటిని వదిలిపెట్టి సర్వసంగపరిత్యాగిగా మారి సన్యాసిని అవుతున్నానేమోనని దిగులు, భయము పట్టుకుంది. దానితో మా బంధు మిత్రుల సలహాలు అడగ్గా వారిలో ఒకరు మన సిద్ధార్థునికి వివాహము చేస్తే సంసార సుఖము మరిగి సన్యాసి కాలేడు అని చెప్పడముతో... నాకు స్వయంవర ఏర్పాట్లు చెయ్యడం ప్రారంభించారు.

*** *** *** *** *** ***

కారు నుండి ఠీవిగా అధికార దర్పముతో ఒక పెద్దాయన 60సం.వయస్సు ఉండి సూట్ బూట్ తోను 30 సం.వయస్సుతో ఉండి అధికార దర్పముతో ఒక స్త్రీ మూర్తి దిగడమును చూసిన ఆనందభిక్షువు తన ప్రక్కనే పోలీసు అధికారితో వీరి గూర్చి ఆరా తీయగా..

ఇందులో  అమ్మాయి ఒక సి.బి.ఐ. ఆఫీసర్ అని చనిపోయిన బౌద్ధ సన్యాసి కూతురని అలాగే ఈమెతో వచ్చిన పెద్దాయన ఈమెకి బాస్ అని అమ్మాయి పేరు జేసి అని, ఆయన పేరు కులకర్ణి అని వివరాలు తెలుసుకొని నిర్వాణలామా చెవిలో వేయగానే లోపలికి వెళుతున్న వారిద్దరిని వీరిద్దరు అనుసరించారు.

లోపలికి వెళ్ళిన జేసి నిర్జీవముగా పడియున్న తన తండ్రి శవమును చూడగానే ఏడుపు తన్నుకుని వస్తుంటే చాలా బలవంతముగా ఆపుకొని నిగ్రహించుకొని తన చిన్ననాటి తండ్రి ఙ్ఞాపకాలు గుర్తు రావడముతో దుఃఖము ఆపుకోలేకపోయినది.ఈ లోపుల.. 

తన బాస్ అయిన కులకర్ణి కాస్త శవమును తేరిపారా నిశిత దృష్టితో చూస్తూ ఈ శవము చుట్టు ప్రక్కల ఏమైన ఆధారాలు దొరుకుతాయేమోనని తన గ్రద్ధ కళ్ళతో ఉన్న చోటు నుండి కదలకుండా చూడటము ప్రారంభించారని నిర్వాణ లామా గ్రహించి మౌనముగా ఉన్నాడు.

ఇంతలో ….త్రివేది పోలీసు అధికారి లోపలికి వచ్చి వీరిద్దరికి సెల్యూట్ చేయగా

కులకర్ణి వెంటనే..త్రివేది.ఈ హత్య కేసు వివరాలు ఎంతవరకు వచ్చాయి?” అనగానే..

తనకు అందిన రిపోర్టు వివరాలు నోటితో చెప్పి..ప్రక్కనే ఉన్న నిర్వాణలామాను చూసి తమ మధ్య జరిగిన సంభాషణ వివరాలు గూర్చి చెప్పడము జరిగింది.ఇదంతా గూడ అక్కడే ఉన్న జేసి గూడ విని మౌనముగా రోదన చేయసాగినది.

కులకర్ణి వెంటనే..త్రివేది.అయితే ఈ లోకములో ఉన్నదో లేదో తెలియని మణి కోసము ఇతనిని హత్య చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చావు గదా.అలాగే కానివ్వు. లోకము దృష్టిలో ఇది శూన్యత భావ స్థితి తట్టుకోలేక ఆత్మహత్య అదే మన దృష్టిలో అర్ధముకాని కేసుగా మార్చండి.గొడవలు,రాద్ధాంతములు,సమ్మెలు జరిగేలోపల ఈ కేసును క్లోజ్ చెయ్యండిఅంటూ బయలుదేరుతుండగా..

జేసి అందుకొని బాస్.నేను కాస్త వ్యక్తిగతముగా నిర్వాణ లామా గారితో మాట్లాడి వస్తాను అనగానే..

కులకర్ణి కాస్త అదోలా అనుమానముగా చూస్తూ ఏదో సందేహము వచ్చినవాడై త్రివేదికి కనుసైగ చేసి..ఏమి తెలియనివాడిలాగా  తన జేబులో ఉన్న వాయిస్ రిసీవర్ పరికరమును ఎంతో లాఘవముగా ఎవరు చూడకుండా నిర్వాణలామా చేతి సంచిలో వేసి ఏమి చెయ్యనివాడిలాగా బయట ఉన్న తన కారు వద్దకి బయలుదేరాడు.

ఇదేమి గమనించని నిర్వాణలామా తన మిత్రుడైన ఆనందభిక్షువుతో కలసి జేసి చూపించిన గదిలోనికి  ఈ ముగ్గురు ప్రవేశించగానే ఆ గది తలుపులు మూసుకున్నాయి.కొంతసేపు ఈ ముగ్గురు మౌనముగా ఆ గదిలో ఉన్నారు.

ఆ తరవాత జేసి తేరుకొని నిర్వాణలామాజీ.మా నాన్న గారిది ముమ్మాటికి ఆత్మహత్య కాదని హత్యయని ఇక్కడున్న వారందరికి తెలుసు.కాని గొడవలు వస్తాయని ఈ కేసును మా బాస్ తారుమారు చేయాలని చూస్తున్నారు.నాకు మా నాన్నగారిని ఎందుకు చంపారో తెలియాలి.నేను వ్యక్తిగతముగా ఈ కేసును సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను.అందుకు మీ ఇద్దరి సహాయసహకారాలు నాకు గావాలి.ఎందుకంటే ఈ కేసులో నరహంతకుడైన దేవదత్త ఉన్నాడు.వీడు మా నాన్నకి సహ ఉద్యోగి.గాకపోతే మా నాన్నగారు పదవి విరమణ తరవాత బౌద్ధధర్మమును స్వీకరిస్తే వాడు మాత్రము మహాయానము స్వీకరించి తాంత్రికవేత్తలతో కలిసి తాంత్రిక పూజలు మంత్రాలు నేర్చుకొని ఏవో తాంత్రిక సిద్ధులను పొందడము మా నాన్న గారు వీడిని ప్రక్కన పెట్టేశారు. దానితో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహము  చెడినది.ఇది ఇలాయుండగా మూడురోజుల క్రితము మా నాన్నగారు నాకు ఫోన్ చేసి బుద్ధుడు తెలుసుకున్న మణి రహస్యమును తాను తెలుసుకోవడము జరిగినదని దాని వివరాలు తనకి ఇవ్వమని దేవదత్త తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాడని ఈ సమయములో నా ప్రాణాలు పోయినగూడ పర్వాలేదుగాని ఆ దుష్టుడైన దేవదత్తకి ఈ రహస్యము ఎట్టి పరిస్థితులలో తెలియకుండా "ది బుద్ధ కోడ్" పేరుతో దానిని భద్రముగా దాచి ఉంచినానని అర్హత,యోగ్యత అలాగే బుద్ధ భగవానుడి అనుగ్రహమున్న వాడికి మాత్రమే ఈ రహస్యమును డీకోడ్ చేసే విధముగా ఏర్పాట్లు చేయడము జరిగినదని చెపుతుండగా ఫోన్ కట్ అయినది.దానితో నేను ఆవేదన చెంది ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఇంటిలో లేరని..దేవదత్త ఆధీనములో బందీగా ఉన్నారని ఆ రహస్య కాగితాలు ఇస్తే గాని తన తండ్రిని విడిచిపెట్టరని నాకు ఫోన్ చేయడముతో  ఆ కాగితాలు కోసము నేను ఆయన గది అంతా వెదకిన గూడ ఎలాంటి ఆధారము కాని దానికి సంబంధించిన కాగితము గాని నాకు కనబడలేదు.ఇదే విషయము నేను వాడికి ఫోన్ చేసి చెబితే వాడు నమ్మకపోగా మా నాన్నను చంపే ప్రయత్నము చేయడము ఆయన అక్కడ నుండి తప్పించుకొని ఈ మ్యూజియమునకు చేరుకొని తన గుండెల మీద గాయాలతో గుర్తు పెట్టుకొని ప్రాణాలు వదిలారు.ఎలాగైన నేను ఆ దైవ రహస్యమును చేధిస్తే కాని మా నాన్నకు ఆత్మ శాంతి కలుగదని నాకు బలముగా అనిపిస్తున్నది అని ఆపుకోలేని ఏడుపు రావడము మొదలైనది.

ఎపుడైతో ఈమె ఏడుపు ఆగినదో ఆ క్షణము నుండి నిర్వాణలామా మాట్లాడటము మొదలుపెట్టాడు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి