38 భాగం

 

38

మానవునికి కష్టనష్టాలకు మూలకారణము అజ్ఞానమని గ్రహించాను. దీనిని పోగొట్టుకోవడానికి మనిషి కాస్త జ్ఞాన మార్గములో నడవాలి. అనగా మనస్సుని లోపలికి ప్రయాణింప చేసి శూన్యములో లయింప చేయగల్గితే పొందేది బ్రహ్మానందమే. మనఃశాంతియే. మనస్సులేని స్థితి. అజ్ఞానము లేని స్థితి. మాయలేని స్థితి. ఎప్పుడైతే మనస్సు శూన్యములో లయింప చేయగలిగితే అపుడు మనకి అవగాహన కలుగుతుంది. ఆపై విచారణ కలుగుతుంది. అవగాహనలో విచారాలు విచారణ చేయ కల్గితే ప్రేమ పుడుతుంది. సదవగాహన లేకపోతే మనిషిలో సామాజిక, మానసిక, భౌతిక బలహీనతలు కలుగుతాయి. తద్వారా ప్రేమ, కరుణ ఉండవు. అవగాహన వలన సదవగాహన ఏర్పడుతుంది. దీనికోసము మనస్సు నిర్మలంగా ఉండాలి. అసలు వాస్తవాలు ఏమిటో తెలుసుకొనే జ్ఞానముండుటవలన మనస్సు నిర్మలమవుతుంది. ఈ పని జరగాలంటే సంస్కారం ఉండాలి. అంటే ఇతరులను అర్ధము చేసుకొనేదే సంస్కారం అవుతుంది. మనస్సులోని ఆలోచనలు, స్పందనలు గ్రహించడమే సంస్కారమును పొందే పరిష్కారం అని గ్రహించాను. దీని కోసమే నా అష్టాంగ అనుభవాలు అనగా సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనం, సమ్యక్ కృషి,సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధిగా ఉంచుకోవాలని గ్రహించాను. మనస్సు అన్నిటినుండి విముక్తి పొందుటకు నాలుగు మార్గాలు ఉన్నాయని అవి

1 . దుఃఖం

2 . దుఃఖహేతువు

3 . దుఃఖోపశమనం

4 . దుఃఖోపశమన మార్గం

అని గ్రహించాను.

అంటే ఫలాపేక్ష సుఖాలు పొందడం, తృష్ణ అనేవి దుఃఖానికి హేతువు అని, దుఃఖానికి కారణము మన అజ్ఞానమని అలాగే దేని యందు అవగాహన లేకపోవడమే... దీనిని అర్ధము చేసుకొని తొలగించుకుంటే దుఃఖోపశమన  మార్గ సూత్రము అవుతుందని అలాగే మనస్సు స్పందన తెలుసుకోవడమే దుఃఖోపశమన మార్గమని గ్రహించాను. దానితో నాకు వరుసగా అష్టసిద్ధులు కలుగుతున్నాయని గ్రహించాను. అనగా దివ్యదృష్టి, దివ్య శ్రవణం, దూరసంచారం, మనోనేత్ర దర్శనం, పంచభూతాల మీద ఆధీనం ఇలా మున్నగు అష్టసిద్ధులు కలిగినాయని అనుభవ అనుభూతి పొందసాగాను.

     అపుడు నాలో అనుమానాలు తీరినాయి. భయాలు నశించాయి. ప్రజ్ఞత ఎవరైనా జనన మరణ వలయాన్ని ఎవరికి వారే సాధన చేసి జ్ఞానమును పొంది అజ్ఞానమును తొలగించుకొని దాటవచ్చునని గ్రహించాను. దానితో నాలో అలజడిలేదు. ఆందోళన లేదు. ఆవేశము లేదు. తాకిడి లేదు. బాధ లేదు. ఆనందము లేదు. ఏమి లేదు. నేనులేను. సర్వం శూన్యం. నిశ్శబ్దం. మహా ప్రశాంతత. ఇదియే ప్రపంచ విషాదాలకు చరమ గీతమని గ్రహించగానే...

ఓ అజ్ఞానమా. నీ చిరునామా ఇప్పుడికి తెలిసింది. ఎన్నో కోట్ల జన్మలు నన్ను నీ అజ్ఞానమాయలో ఉంచినావు గదా. ఇప్పుడు నీ గుట్టు రట్టు అయింది. నీ మర్మ రహస్యము బట్ట బయలైంది. ఇంక నేను అజ్ఞానంలో బందీగా ఉండను. ఉండలేను. ఉండవలసిన అవసరమేలేదు అనుకోగానే... ఏదో తెలియని పరమ ప్రశాంత స్థితియైన శాంతిని నా మనస్సు పొందడముతో సత్యము తెలిసింది. మాయ మాయం అయింది. ఎరుక ఎరుక అయింది. ఉన్నస్థితి నుండి ఉన్నత స్థితి పొందడము అయిందని అనుకోగానే.... నాలో నవ్వు మెదలైంది. అది కాస్త వికసించిన మణి పద్మములాగా మెరుపు కాంతి మెరిసింది.

*** *** *** *** *** ***

నిర్వాణలామా బృందము ముందు కోరలు చాచి బుసలు కొడుతున్న కాగిత యంత్ర పామును చూస్తున్నవారందరికి ఆశ్చర్యము కలిగే విధముగా

ఓ విచిత్ర సంఘటన జరగడానికి నాంది అయినది.

అది ఏమిటంటే ఈసారి సూర్యరశ్మి కాస్త క్షితిగర్భ దగ్గర ఉన్న లేత నీలిరంగు స్ఫటిక రత్నము మీద కాంతి పడగానే ఈ కాంతి కాస్త పడగ విప్పి బుసలు కొడుతున్న కాగిత సజీవ పాము మీద పడి పడగానే అది కాస్త నెమ్మది నెమ్మదిగా ఈ పాము అలాగే ఈ పాము చిత్రము దగ్దమవుతున్న దృశ్యము చూస్తున్న వారంతా గూడ నెమ్మది నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడము ఆరంభించారు.ఈ తంతు జరగకపోతే నిర్వాణలామా కాగిత గరుడ యంత్రమును ఈ కాగిత పాము యంత్రము మీద ప్రయోగించాలని అనుకున్నాడు.గాకపోతే 42 అడుగుల పాము సంహారానికి కనీసం 84 అడుగుల గరుడ పక్షి అవసరమవుతుంది.దీని రెక్కల చప్పుడుకే బిల్డింగ్ క్షణాలలో నేలమట్టము అవుతుంది.అందుకే ఈ ప్రయోగము చేయడానికి నిర్వాణలామా ఆలోచనలో పడ్డాడు.కాని తను  ఊహించినట్లుగానే దీని సంహార ప్రక్రియను గూడ దీనిని ఏర్పరచిన వాళ్ళు ఏర్పరచేసరికి నిర్వాణలామా కాస్త స్థిమితపడ్డాడు.ఈ నాగ బంధనము వలన అన్యులు ఎవరైన గూడ భయపడి పారిపోతారని ఇలా ఏర్పాట్లు చేసి ఉండి ఉంటారని అనుకుంటున్న సమయములో

అక్కడే ఉన్న విభూధినాధ్ వెంటనే నిర్వాణలామా.నాకు ఇపుడు ఒక విషయము గుర్తుకు వచ్చింది.అది ఏమిటంటే రాత్రిపూట మన అంబేద్కర్ ఈ గదికి వచ్చినపుడు పాము కదులుతున్న శబ్దాలు బుసలు తరచుగా వినబడుతున్నాయని ఫోన్ చేసి చెప్పేవాడు.అపుడు ఏదైనా నాగబంధనము ఉన్నదేమోనని చూడమని చెబితే అలాంటిది ఏమి కనిపించడము లేదని వాడు చెప్పేవాడు.దానితో నేను కాస్త అయితే పాము శబ్దాలు వినిపించడము నీ భ్రమ భ్రాంతి యని నేను కొట్టిపారేశాను.ఇపుడు అది నిజమేనని కళ్ళారా చూశాను అంటూండగా

ఈ పాము చిత్రము అదృశ్యమై దానికి బదులుగా ఒక ద్వార బంధము అందరికి కనిపించినది.నిర్వాణలామా దీని దగ్గరికి వెళ్ళగా దీనిని తెరచిచూస్తే లోపలవైపు  వెళ్ళడానికి మెట్లు కనిపించేసరికి నిర్వాణలామాతో పాటుగా అందరు ఒక్కొక్కరిగా ఈ భూ గృహ సొరంగ గదిలోకి దిగారు.

కాని ప్రొఫెసర్ విభూదినాథ్ ఇందులోనికి దిగకుండా తనకి అత్యవసరముగా ప్రకృతికార్యమైన మూత్ర సమస్య రావడముతో దానిని తీర్చుకోవడానికి మ్యూజియము బయట ఉన్న టాయిలెట్లు వైపుకి వెళ్ళడము అక్కడే మారువేషములో ఉన్న దేవదత్త గమనించి ఈయన వెనుక వెళ్ళి ఆయనను చంపి యధావిదిగా ఏమి జరగనట్లుగా నిర్వాణలామా బృందము వెళ్ళిన రహస్యగదికి ఈయన రూపధారిగా వెళ్ళాడు.

తీరా లోపలకి వెళ్ళితే అక్కడ వీరందరికి ఒక పెద్ద పురాతన చెక్క బల్ల మాత్రమే ఈ గదిలో కనిపించింది.ఇక గది అంతా గూడ ఖాళీగానే ఉంది.ఎలాంటి ఫోటోలు గాని విగ్రహాలు గాని ఏమైన ఆధారాలు దాచి ఉంచిన దాఖలాలు వారిలో ఎవరికి కనిపించలేదు.ఇంత కష్టపడి శోధన చేస్తే ఖాళీ గదిలో ఒక చెక్క బల్ల మాత్రమే కనిపించేసరికి అందరిలో ఒక్కసారిగా ఏదో తెలియని అసహనము, నిరుత్సాహము ఆవరించింది.ఇది ఇలా ఉంటే నిర్వాణలామా దృష్టి మాత్రము కనిపించే చెక్క బల్ల మీద ఉన్న నీటి బిందువులు చూడగానే ఏదో ఆలోచనలో పడ్డాడు.ఈ నీటి బిందువులు మిగిలిన వాళ్ళు చూసిగూడ చెమ్మకి నీటి బిందువులు ఏర్పడి ఉండి ఉంటాయని ఎవరికి వాళ్ళే అనుకున్నారు.కాని నిర్వాణలామా అలాగే విభూధినాధ్ అలా అనుకోలేదు.

పూర్వము బౌద్ధలామాలు తమకి తెలిసిన రహస్యాలు ఇతరుల చేతికి అందకుండా తమ మంత్రశక్తి ప్రభావముతో మంచు గడ్డలు లేదా నీటి బిందువులుగా మార్చేసి ఎవరికి అర్ధము గాకుండా ఉంచుతారని ఇలాగే హిమాలయాలలో ఎపుడో రాసి పెట్టి ఉన్న విశ్వ భవిష్య గ్రంధాలు గూడ ఈ విధముగానే భద్రపరచినారని వీరిద్దరు చదువుకున్నారు.ఈనాడు అది నిజమేనని ప్రత్యక్షముగా చూస్తున్నారు.గమనిస్తున్నారు.

ఇంతలో ఇదేమి తెలియని గంజాయిస్వామి వెంటనే తన చేతితో ఈ నీటి బిందువులను తుడవాలని ప్రయత్నములో ఉండగానే

నిర్వాణలామా తన ఆలోచన నుండి బయటపడి స్వామి.అంత పని చేయకండి.మనకి ఉన్న ఆధారము ఈ నీటి బిందువులే.ఇవే నాశనము అవితే మనకి మనమే ఆధారమును నాశనము చేసుకున్నవారము అవుతాము అంటూ

ఈ నీటి బిందువుల అమరికను గమనించి దాని ప్రకారము మంత్రశక్తితో  తిరిగి వీటిని కలిపేసరికి అందరు ఆశ్చర్యము పోయే విధముగా ఈ చెక్కబల్ల పైన గాలిలో మంచు గడ్డలతో 3డి కాలచక్ర నిర్మాణము ఆవిష్కరించబడింది.దానిని చూడగానే అందరికి ఆనందమేసింది.ఇలా గూడ రహస్యాలను దాచగలరా? అని ఆశ్చర్యమేసింది.ఇదేమి పట్టించుకోని నిర్వాణలామా నిశిత దృష్టి అంతా ఈ కాల చక్ర నిర్మాణములోని పైభాగములో ఉన్న అరచెయ్యి గంధపు చెక్క మీద దృష్టి పడినది.దానిని ఎంతో లాఘవముగా బయటికి తీయగానే ఈ చెక్కపెట్టె పైభాగములో అంబేద్కర్ గుండెల మీద గీసుకున్న ఒక డైమండ్ గుర్తు అలాగే దీని క్రింద త్రికోణ గుర్తు ఉండటము అందరు గమనించారు.ఇక్కడ ఈ రెండూ గుర్తులు పంచ లోహాల రేకులతో ఉన్నాయి.ఈ బాక్స్ తెరవడానికి ఎలాంటి కోడ్ విధి విధానము లేకపోయేసరికి అందరు ఊపిరి పీల్చుకొని ఈ బాక్స్ తెరవగానే అందులో  అయిదు నక్షత్రాకారాలు దానిలోపల అయిదు చిహ్నాలు కొన్ని అక్షరాలు ఉన్నాయి.అంటే ఈ కాల చక్ర నిర్మాణము తగ్గట్లుగా చిన్న సైజ్ కాలయంత్రమును కోడ్ గా ఉపయోగించినారని తెలుసుకోవడానికి వీరికి అట్టే సమయము పట్టలేదు.




నిర్వాణలామా ఈ అయిదు కాల యంత్రాలును నిశిత దృష్టితో గమనించసాగాడు.ఇవి చూడటానికి ఒకే విధముగా ఉన్నపుడికి ఈ చిహ్నాలు దీనికి తగ్గ అక్షరాలు వరుస క్రమములో తేడాలున్నాయని అంటే ఏదో ఒక చిహ్నము ప్రకారము 

ఈ కాల యంత్రాలను అమర్చితే  ఈ అక్షరాలు ఒక అమరికగా ఏర్పడి ఒక ఆధార శ్లోకము ఇస్తాయని నిర్వాణలామా గమనించి ఇదే విషయాన్ని అక్కడున్న వారందరికి వివరించాడు.ఇది విన్న వాళ్ళు అంతా నోరెళ్ళపెట్టారు.కారణము ఏ చిహ్నము ఆధారముగా వీటిని అమర్చారో ఎలాంటి ఆధారము ఇవ్వలేదు.ఒకవేళ ఏదైన తప్పు అమరిక చేస్తే ఇందులో ఉన్న ఆధార శ్లోకము నాశనము అవుతుంది.ఒకే ఒక అవకాశము తీసుకొని సరియైన చిహ్నమును అమర్చాలి.అపుడే ఆధారము బయటికి వస్తుంది.ఇది తెలుసుకున్న అందరిలో ఎదో తెలియని ఉత్కంఠ,కంగారు,భయము ఏకకాలములో మొదలైనాయి.

అందరి దృష్టి నిర్వాణలామా

 నిశిత దృష్టి మీద ఉంది.అతను ఏమి చేస్తాడా?ఎలా చేస్తాడా?చేస్తాడా? లేదా అని..



నిర్వాణలామా ఈ అయిదు కాల యంత్ర గుర్తులను పరిశీలించి చూడగా అందులో ఒక డైమండ్ గుర్తు,ఒక త్రికోణ గుర్తు,ధర్మ చక్రము గుర్తు,సూర్యుడు గుర్తు,చంద్ర గుర్తు ఉన్నాయి.ఈ గుర్తుల ప్రక్కనే అయిదు నక్షత్రాకార కోణాలలో ఒక్కొక్క దానిలో ఒక్కొక్క అక్షరము ఉన్నది.అంటే ఈ గుర్తులను ఒక వరుస క్రమములో అమరిస్తే దానిలో ఉండే అక్షరాలు ఒక అమరికలో ఏర్పడి ఒక సమాచారమును ఇస్తాయి.అది ఏ గుర్తు ఆధారము చేయాలో ఇతనికి ఒక పట్టాన అర్ధము కాలేదు. సరే ఈ గుర్తులు ప్రక్కనే ఉన్న అక్షరాలు గమనిస్తే ఓం... శ్రీ.. హుం.. మ.. ణి.. పద్మ..హుం..ఓమ్..మణి..హుమ్..పద్మే..శ్రీ..క్లీం..ప..ద్మ..అని ఒక్కొక్క కోణము సుమారుగా 5 అక్షరాలు చొప్పున అయిదు కోణాలు 25 అక్షరాలు ఉన్నాయి.ఈ అక్షరాలకి అలాగే 5 చిహ్నాలకి సంబంధము కనిపించడము లేదు.అసలు చిహ్నాల ఆధారముగా కలపాలా లేదా అక్షరాల ఆధారముగా కలపాలో గూడ తెలియని అయోమయ స్థితి. ఉన్నది ఒకటే అవకాశము. పోతే అంటా సర్వ నాశనము అవుతుంది.ఏమి చేయాలో ఎవరికి అర్ధము కాని స్థితి.మనస్సుకు తోచిన విధముగా ప్రయత్నించే అవకాశమే లేదు.ఏదో గ్రుడ్డిగా ప్రయత్నము చేద్దామంటే ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు.అనుకుంటూ నిర్వాణలామా ఆలోచనలో పడ్డాడు.ఏమి జరుగుతుందో అని అందరు కంగారుపడుతున్నారు. 

ఇంతలో….

హఠాత్ పరిణామముగా ఎవరు గూడ కలలో ఊహించని విధంగా

విభూధినాధ్ చేతిలో మెషీన్ గన్ చూడగానే అందరికి ఆశ్చర్య భయమేసినది.ఆయన ఉన్నట్టుండి నిర్వాణలామా మెడ దగ్గర ఈ గన్ పెట్టి

నిర్వాణలామా.నేను ఎవరో మీకు తెలుసా?అందరు అనుకుంటున్నట్లుగా నేను విభూధినాధ్ గాదు.ఆయన రూపములో ఉన్న దేవదత్తను అంటూ తన ముఖానికి ఉన్న విభూదినాథ్ ముఖ మాస్క్ ను తొలగిస్తూ ఇపుడే ఒక అరగంట క్రితమే మూత్రానికి వెళ్ళిన విభూదినాథ్ ను హతమార్చి ఆయన రూపధారిగా మీ ముందుకి వచ్చినను నన్ను మీలో ఎవరుగూడ గుర్తుపట్టలేదు. నా కోసము ప్రపంచదేశాలే నన్ను పట్టుకోవాలని చూస్తున్నాయి.నేను మరియు అంబేద్కర్ కలిసి ఈ మణి శోధన చేశాము.కాని ఈశోధనలో  వచ్చే పజిల్స్ సాల్వ్ చేయడము మా ఇద్దరికి చాలా కష్టమైంది.అపుడు నేను కాస్త మహాయాన తాంత్రిక సిద్ధులతో కలిసి అదే అంగుళీమాల సహాయముతో ఈ పజిల్స్ సాల్వ్ చేద్దామంటే అంబేద్కర్ వప్పుకోలేదు.దాంతో ఎవరికి వారే ఈ మణి శోధన పరిశోధనలు చేశాము.కాని మాకు తెలియని విషయమేమిటంటే ఇవి రెండు మణులకి చెందిన పరిశోధన అని అందులో మణి కీ స్టోన్ కాస్త శంభల గ్రామములోని    బ్రహ్మ చింతామణికి తీసుకొని వెళ్ళుతుందని రెండవది పద్మ కీ స్టోన్ కాస్త అగర్తల గ్రామములోని పాదరస మణి దగ్గరకి తీసుకొని వెళ్ళుతుందని మేముద్దరము ఊహించలేకపోయాము. ఎవరికివారే మణి శోధన చేసుకుంటూ కైలాస పర్వతము దగ్గరికి చేరితే గాని మాకు రెండు మణులు ఉన్న విషయము తెలియరాలేదు.దానితో వాడు నన్ను అక్కడే పోలీసుల చేత అరెస్టు చేయించపోతే అక్కడ నుండి నేను  విదేశాలకి పారిపోయాను.

వాడు కాస్త కాశీ క్షేత్ర భౌద్ధధర్మ ప్రొఫెసర్ విభూదినాథ్ తో కలిసి ఈ మణి పరిశోధన కొనసాగిస్తూ వీరిద్దరు గూడ ఈ రెండు మణుల ఆధారాల మీద మరింత పరిశోధన చేసి చివరికి రెండు దేవతా పుష్పాలుండే చోటును కనిపెట్టలేక ఒక అడుగు దూరములో ఈ మణిశోధన ఆగిపోయినదని వీడు అవి ఎక్కడున్నాయో తెలుసుకున్న గూడ అక్కడికి వెళ్ళడానికి రూట్ మ్యాప్ లభించలేదని అలాగే దేవతాపుష్పాలు లభించలేదని నేను తెలుసుకొని ఇండియాకి తిరిగివచ్చి మహా కాశీ క్షేత్రమునకు చేరుకొని అక్కడున్న ప్రొఫెసర్ విభూధినాధ్ ను  కలుసుకొని ఈ మణి శోధన వివరాలు నాకు చెప్పమంటే చెప్పకపోతే వీడిని ఒక ప్రక్క బెదిరిస్తూ..మరోవైపు అంబేద్కరును గూడ బెదిరిస్తూ...ఈ లోపల నా ప్రయత్న భాగముగా అంగుళీమాలలోని సైకో బలహీనతను ఆధారము చేసుకొని ఈ మణి శోధన ప్రయోగాలకి వాడుకున్నాను.నా బ్యాడ్ లక్.వాడు గూడ ఈ మణి శోధనలో ఒక అడుగు దూరములో కాశీ క్షేత్రములో పోలీసులకి దొరుకుతాడని నేను ఊహించలేదు. అంతటితో వాడి చరిత్ర ముగుసిపోయినదని అనుకున్నాను.దానితో విభూధినాధ్ పేరుతో స్వయముగా రంగములోకి దిగాను.ఏ దేవతా పుష్పాల కోసము అలాగే రూట్ మ్యాప్ కోసము ఇన్ని సం.రాలు ఎదురుచూశానో ఆ తరుణము రానే వచ్చినది.

నిర్వాణలామా.నీ చేతిలో ఉన్న కాలయంత్ర బాక్స్ నా చేతిలో పెట్టు.దానిని నేను విదేశాలకి తీసుకొని వెళ్ళి సాల్వ్ చేస్తాను లేదా ఎక్కువ మొత్తములో విదేశాలకి అమ్మి వేస్తాను.నాకు ఎటు చూసిన లాభమే.పోలీసులు వచ్చే   అవకాశముంది.వాళ్ళు వస్తున్నారని నాకు సమాచారము అందింది.అందుకే నీవు దీనిని సాల్వ్ చేసేదాకా నాకు నీ దగ్గర ఉండే అవకాశము లేదు.లేదంటే నా మెషీన్ గన్ తో అందరిని చంపివేస్తాను అంటూండగానే

గంజాయి స్వామి వెంటనే అరే.నీ నీ కోసమే నేను ఎదురు చూస్తుంటే నువ్వు విదేశాలకి పారిపోతే ఎలారా.నీ వలన నాకు జరిగిన నష్టమును ఎవరు పూడుస్తారురా.అనగానే

అసలు నీవు ఎవడివిరా?నా వలన ఎందరికో నష్టము కలిగింది.వారిలో నీవు ఎవరివి?ఇపుడు కస్ఠ నష్టాల గూర్చి మాట్లాడుకొనే సమయము నాకు లేదు.నిర్వాణలామా.నువ్వు వెంటనే నీ చేతిలో ఉన్న బాక్స్ నాకు ఇచ్చేయి.ఎవరు గూడ మిమ్మల్ని రక్షించలేరు అని అంటూండగా

బయట వైపు నుండి పోలీసుల జీపుల హారన్ లు వినిపించేసరికి 

నిర్వాణలామా ముందుకి కదలబోయేసరికి అలవాటు లేని మెషీన్ గన్ దేవదత్త ఉపయోగించేసరికి అది కాస్త గురి తప్పుతూ తప్పుడు విధముగా ప్రేలుతూ ఉండటము గమనించిన గంజాయి స్వామి ఒక ఉదుటున దేవదత్త మీదకి ఉరికి వాడి మెడ మీద గట్టిగా బలంగా పోలీసు దెబ్బ కొట్టేసరికి వాడు ఈ దెబ్బకి కాచుకోలేక స్పృహ తప్పి పడిపోవడము జరిగింది.ఈ లోపల కులకర్ణి,త్రివేది బృందము కాస్త వీళ్ళున్న రహస్యగదికి మెట్ల మార్గము ద్వారా చేరుకున్నారు.

అపుడికే విభూధినాధ్ స్పృహ తప్పి చేతికి బేడీలు ఉండేసరికి కులకర్ణికి ఏదో అనుమానము వచ్చి ఏమైంది.ఏమి జరిగింది అనగానే

గంజాయి స్వామి అక్కడ జరిగినదంతా పూస గ్రుచ్చినట్లుగా చెప్పేసరికి   కులకర్ణి నొసలు ముడి వేస్తూ

మాకు వచ్చిన సమాచారము ప్రకారము నా ప్రక్కన ఉన్న త్రివేది పోలీసు అధికారి దేవదత్త అనగానే

త్రివేది ముఖములో భయము మొదలై సార్.నేను దేవదత్తను కాను.కాని వాడి తొత్తును.వాడు ఇచ్చే బహుమానాలకి ఆశపడి మన పోలీసుల సమాచారము ఎపడికపుడు చెబుతూ ఉండేవాడిని.అంతే.కాని వాడు నేను కాను.వాడు ఎలా ఉంటాడో ఆ పిచ్చోడు అంగుళీమాలకి తెలియడానికి నా ఫోటోని వాడికి నేనే పంపించాను.దానిని వాడు కాస్త దేవదత్త అనుకొని నా ఫోటోను పూజిస్తుండేవాడు.అంతే సార్ జరిగింది.

కులకర్ణి వెంటనే సరే.త్రివేది.నీ విషయము గూర్చి ఏమి చేయాలో తరవాత ఆలోచిద్దాము.ఇంతకి ఈ గంజాయి స్వామి ఎవరో చూద్దామా?” అనగానే 

గంజాయి స్వామి కాస్త తమ ముఖానికి ఉన్న రబ్బరు మాస్క్ తీయగానే అతను ఎవరో చూడగానే జేసి ముఖము సిగ్గుతో ముడుచుకుపోవడము అందరు గమనించారు.

అపుడు కులకర్ణి వెంటనే ఇతను ఎవరో కాదు.జేసికి కాబోయే భర్త పేరు థామస్.ఇతను గూడ సి.బి.ఐ ఆఫీసర్.తన ప్రియురాలిని రక్షించుకోవడానికి అలాగే ఈ పరిశోధనలో మీలో ఎవరికి ప్రాణాలు పోకుండా ఉండటానికి నేను ఏర్పరచిన రహస్య అధికారి.ఇతను ఉన్నాడనే ధైర్యముతో నేను దూరముగా ప్రశాంతముగా ఉన్నాను అని చెబుతుండగా

స్పృహలోనికి వచ్చిన విభూధినాధ్ అలియాస్ దేవదత్త కాస్త తన చేతిలోని గన్ కి పని చెబుతున్నాడని తెలుసుకున్న కులకర్ణి మారు ఆలోచన చేయకుండా తన చేతిలో ఉన్న గన్ తో అతడి మీద ఫైరింగ్ చేసేసరికి  వాడి శరీరమును 18 బుల్లెట్లు ముద్దు పెట్టుకున్నాయి.దానితో వాడు కాస్త శాశ్వత నిద్రలోనికి జారుకున్నాడు.

ఇంతలో కులకర్ణికి తన అధికారుల నుండి ఫోన్ వస్తే ఎత్తగా సార్.ఇక్కడ ఇపుడే అంగుళీమాల తన గురువు చెప్పిన ప్రొఫెసర్ విభూదినాథ్ ను చంపలేదని విపరీత ఆవేదన ఆవేశానికి గురి అవుతూ

గురూజీ..నన్ను క్షమించండి.మీరు చెప్పిన పని చెయ్యనందుకు మీకు నాపై కోపము వచ్చి నన్ను చూడటానికి మీరు రాలేదని నాకు అర్ధమయినది.మీ దర్శనభాగ్యానికి నోచుకొని ఈ నా దేహజన్మ వ్యర్ధమంటూ తన రబ్బరు బొటనవ్రేలులో ఉంచుకున్న పాము విషము నీటిలో కలుపుకొని క్షణాలలో చనిపోయాడు.వాడిని రక్షించాలనే మా ప్రయత్నాలు వృధా అయినాయి అనగానే

కంగారు పడకండి.వాడి గురువైన దేవదత్త గూడ ఇపుడే నా చేతిలో చచ్చాడు.వాడి శిష్యుడు అక్కడ చచ్చాడు అన్నమాట అని ఫోన్ కట్ చేసి అందరికి ఈ విషయము చెపుతుండగా..

ఈ రహస్యగదిలో రహస్యముగా అమర్చిన టైమర్ తిరగడము మొదలైనది.

18 సెకన్స్..17 సెకన్స్ ..16 సెకన్స్ ..అని పెద్దగా

ఎవరో మగ వ్యక్తి చెబుతున్నట్లుగా గొంతు వినబడేసరికి  నిర్వాణలామాకి అపుడు కాని అసలు విషయము అర్ధము కాలేదు.అంటే తన చేతిలో ఉన్న కాల యంత్రబాక్స్ లో టైమర్ ఉంది.అది ఎన్ని ని||లకి ఉన్నదో తను గమనించలేదు.అది ఇపుడు 18 సెకన్స్ మాత్రమే సమయము ఉన్నదని చెబుతోంది.ఈ లోపల దీనిని సాల్వ్ చేయలేకపోతే ఈ ఆధారము గూడ నాశనమవుతుంది అనుకోగానే

15 సెకన్స్..14 సెకన్స్..13 సెకన్స్..అని

వాయిస్ టైమింగ్ గూర్చి చెపుతుంటే

ఇది విన్న అందరిలోను ఏదో తెలియని భయము కంగారు మొదలైంది.నిర్వాణలామా గూడ ఏమి చేయాలో అర్ధము కాని పరిస్థితి.అయోమయ స్థితి.దీనిని ఎలా సాల్వ్ చేయాలో అర్ధము గాని స్థితి.

ఇది ఇలా ఉండగా

అక్కడే ఉన్న దేవదత్త డెడ్ బాడి కదలుతున్న అనుభూతి కలిగేసరికి

ఆనందభిక్షువు వెంటనే స్వామి.ఇంక దేవదత్త చావలేదు.వాడి డెడ్ బాడి కదలుతున్నది.ఒకసారి చూడండి అనగానే

నిర్వాణలామాకి మాత్రము డెడ్ బాడి అనే మాట మీద దృష్టి పెట్టగానే 

అంబేద్కర్ డెడ్ బాడి గుర్తుకు వచ్చినది.ఆయన గుండెల మీద గీసుకున్న డైమండ్ గుర్తు అలాగే త్రికోణ గుర్తు అపుడు గుర్తుకు వచ్చాయి.ఈ రెండు గుర్తులు ఈ బాక్స్ పైభాగములో ఉన్న విషయము గుర్తుకు వచ్చి ఈ పజిల్స్ కి ఇదే సొల్యూషన్ కోడ్ యని గమనించి ఈ అయిదు నక్షత్రాల ఆకారాలలోని ఒకే విధముగా మణి గుర్తు అది గూడ త్రికోణము కోణము మీద ఉండేటట్లుగా ఈ అయిదు కాలయంత్రాలను అమర్చుతుండగా




4సెకన్స్..3సెకన్స్..2 సెకన్స్..అంటూ

టైమర్ వాయిస్ టైమింగ్ చెబుతున్న గూడ పట్టించుకోకుండా ఈ అయిదు యంత్రాలను డైమండ్ గుర్తు ప్రకారము ఒకేవిధముగా అమర్చిన అది కాస్త ఒకే త్రికోణములో అమరేసరికి మరుక్షణము

                                                                                          ఓం-మణి-పద్మ-హుం

అమరిక రాగానే ఈ బాక్స్ క్రింద భాగము బయటికి వచ్చింది.అపుడు సుగంధ పరిమళాలు ఈ గదిలో వ్యాపిస్తుండగా

 

 మణిపద్మము

ఉండే హిమాలయ రహస్య గ్రామాల పేర్లు

మణి--------శంభల గ్రామము

పద్మము----అగర్తల గ్రామము

అంటూ ఈ కాల యంత్రాలలోని అక్షరాలు చూపించాయి.దానితో పాటుగా ఈ గ్రామాలకి వెళ్ళడానికి రూట్ మ్యాప్ యున్న తాళపత్రాలతో పాటుగా 12సం.రాలకి పూసే బ్రహ్మ కమలము అలాగే 12 నెలలకి ఒకసారి దొరికే పారిజాత పుష్పాలు సజీవముగా కనబడేసరికి అక్కడున్న అందరిలోను చెప్పరాని..చెప్పలేని ఆనందమేసింది.టైమర్ శబ్దము ఆగిపోయింది.

కాని ఈ గదిలోని గోడలలో పెచ్చులు ఊడటం మొదలవుతుండగా అందరు కలిసి ఒక్కొక్కరుగా మెట్ల మార్గము ద్వారా పైకి చేరుకున్నారు.ఈ లోపల చనిపోయిన దేవదత్త శవమును బయటికి తీసుకొని వచ్చే అవకాశము లేకుండానే రహస్య గది పూర్తిగా ధ్వంసము అయిపోయింది.ఒక దేవాంతకుడి చరిత్ర అంతటితో ముగిసిపోయింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి