06 భాగం

 

06

మా నాన్నగారు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే రేపే నాకు 8  రోజుల వయస్సు వస్తుంది. మా తల్లిగారు చూస్తే ఆరోగ్యముగా...ఏలాంటి మనో వేదనలు లేకుండా ఉన్నారు. ఆరోగ్యముగా ఉన్న మనిషి రేపటికల్లా ఎలా మరణము పొందుతుందో మా నాన్నగారికి అర్ధము కాలేదు. దానితో రేపు జరగబోయే చమత్కార లీలను బట్టి అసిత మహర్షి అలాగే ఈ యువ జ్యోతిష్య పండితుడు చెప్పే జాతక ఫలితాలు నమ్మాలా వద్దా అని ఆలోచించవచ్చని మనస్సులో అనుకొని ఈ పండితుడికి  బహుమానాలు ఇచ్చి పంపించారు.

ఆ రాత్రి మా నాన్నగారు రాణివాసమైన మా అమ్మ ఉండే అంతఃపురమునకు చేరుకొని మా అమ్మతో జరిగిన అన్ని విషయాలు పూసగుచ్చి చెపుతూ తల్లి గండము గూర్చి మాత్రము చెప్పకుండా నిద్రలోనికి జారుకున్నారు. కాని మా అమ్మ విపరీత ఆనందడోలికలలో ఊగిపోయింది. ఎందుకంటే తన కుమారుడి వలన లోకకళ్యాణ కార్యము జరుగుతోందని... భోగి గావలసినవాడు యోగి అవుతున్నాడు. ఇతడి జననము వలన తమ వంశమే గాకుండా తమ రాజ్యమైన కపిలవస్తుకు యావత్ ప్రపంచం సర్వదా రుణబడి ఉంటుందని భావ ఆలోచనకే ఈమె మనస్సు కాస్త అమిత ఆనందమునకు గురి అవుతుండగా... ఈమె హృదయ స్పందనలు అమితముగా పెరిగి రక్తపోటు వచ్చి నిద్రలోనే శాశ్వత మరణమును పొందింది. ఈ విషయము మర్నాడు కాని మా నాన్నగారు నిద్రలేచి... ప్రక్కనే నిర్జీవములాగా పడియున్న అమ్మ దేహమును తట్టి లేపుతుండగా... శరీరము చల్లబడి ఉండటము గమనించి ఆందోళనకు గురి అవుతూ ఏదో సందేహము కల్గి ముక్కు దగ్గర చేతిని పెట్టి చూడగా శ్వాస ఆడటము లేదని గమనించి... అంటే యువ జ్యోతిష్యుడు చెప్పినది సత్యమనే  ఆలోచనకే ఈయన భయపడి పెద్దగా అరుస్తూ తన పరివారమును పిలువడము జరిగింది.

        ఎనిమిది రోజుల వయస్సు ఉన్న నన్ను చూచేదెవరు? ఆలనా పాలనా పట్టించుకోని పరిచారికల మీద వదిలేస్తే అంత భావ్యముగాదని... అలాగని మరో వివాహము చేసుకుంటే వచ్చే ఆవిడ నన్ను ఎలా చూస్తుందో.... ఏ విధముగా పెంచుతుందోనని మా నాన్నగారిలో మరో ఆవేదన మొదలైంది.

 

*** *** *** *** *** ***

త్రివేది కాస్త చనిపోయిన బౌద్ధ సన్యాసి యొక్క గతచరిత్ర అనగా ఈయన సన్యాసదీక్ష తీసుకోక ముందు ఈయన చరిత్ర వివరాలు తెలుసుకొనే ప్రయత్నాలు చేయడము పూర్తి అవ్వడముతో తన టేబుల్ మీద ఉన్న ఈ నివేదిక పత్రాలు చదవడము ప్రారంభించాడు.

చనిపోయిన వ్యక్తి  పేరు అంబేద్కర్ అని, ఈయన కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ యందు ఉన్నత అధికారిగా పనిచేసి 6 సం.. ల క్రితమే పదవి విరమణ చేశారని..ఆ తరవాత ఈయన తనకున్న అమిత ఆసక్తితో బౌద్ధధర్మము మీద పరిశోధనలు చేస్తుండగా..ఓం-మణి-పద్మ-హుం అను గురు మంత్రమునకు ఆకర్షితులై ఈ మంత్రము ఏదైన మణి సూచన చేస్తుందా? అని పరిశోధనలు చేయడము ప్రారంభించాడు.దానితో 14 వ శతాబ్దము నాటి బుద్ధుడి చిత్రాలలో చేతిలో ఏదో మణి ఉన్నట్లుగా గీసి ఉండటము అలాగే 1903-1909 మధ్యకాలములో లామా ద్యోర్జీ బోగ్యాల్ తను ప్రత్యక్షముగా  హిమాలయాలలోని రహస్య గ్రామమునందు ఉన్న మణిని చూడటము జరిగినదని తన ఆత్మకథలో చెప్పిన విషయాలను ఆధారముగా చేసుకొని తన అనుమానము నిజమే అన్నట్లుగా ఇవి నిదర్శనముగా నిలుస్తున్నాయని అనుకొని మరింత లోతుగా ఈ మణి పరిశోధన చేయడము ప్రారంభించాడు.

దీనికి తోడుగా బ్రిటీష్ ప్రభుత్వ సైనికాధికారి అయిన చార్లెస్ బెల్ కాస్త విక్టోరియా మహారాణికి సమర్పించిన సీక్రెట్ ఫైల్ 212 డాక్యుమెంట్లు దొరకడముతో మరింత శ్రద్ధ భక్తితో గోబి ఎడారి ప్రాంతము నుండి మొదలై హిమాలయాలలోని రహస్య గ్రామము దాకా తన పరిశోధన గావించాడు.గాకపోతే ఆ గ్రామము ఆ హిమాలయ ప్రాంతములో ఎక్కడ ఉన్నదో తెలియలేదని తెలిసి ఉంటే మణి పరిశోధన విజయవంతమై ఉండేదని ఈ పరిశోధన వివరాలు అన్నిగూడ ఎప్పటికప్పుడు నా బాల్య మిత్రుడైన దేవదత్తుడికి చెప్పడము జరుగుతుండేదని గాకపోతే ఈ మణిని ఎలాగైనా దక్కించుకోవాలని  బౌద్ధధర్మములోని వజ్రాయాన శాఖకి సంబంధించిన తాంత్రికవేత్తలను కలుస్తుండేసరికి ఆఖరికి మణి ఉండే రహస్య గ్రామ ప్రాంత వివరాలు తను తెలుసుకున్న గూడ ఇతనికి చెప్పకుండా వాటిని రహస్య కోడ్ లో భద్రపర్చడము  జరిగినదని దీని ప్రారంభ ఆధార గుర్తులే తన గుండెలమీద డైమండ్ గుర్తు అలాగే త్రికోణ గుర్తు ఈ మణి పరిశోధన చేసేవారికి దోహదము అవుతాయని బుద్ధుడికి అత్యంత విలువైన మణి దగ్గరకి తీసుకొని వెళ్ళతాయని తను రహస్యముగా దాచిన వివరాల కోసము దేవదత్త అలాగే వీడి అనుచర గణము మరియు తాంత్రికవేత్తల వర్గము నన్ను భయపెట్టి బాధపెట్టి హింసపెట్టి వివరాలు తెలుసుకొనే విశ్వ ప్రయత్నాలు చేస్తుండేసరికి వారి బాధలు తట్టుకోలేక మణి రహస్యము గూర్చి లోకానికి చెప్పలేక తనలోతాను కుమిలిపోతుండేసరికి తనకి శూన్యత భావ స్థితి పొందినానని అందరూ అనుకొనేటట్లుగా దేవదత్త అనుచరులు ప్రచారము చేయడము అలాగే తాంత్రికవేత్తల సహాయముతో నన్ను నా మనస్సును తమ ఆధీనములోకి తెచ్చుకోవాలని ముమ్మారు ప్రయత్నాలు చేస్తుండేసరికి చివరికి వీరి చేతులలో నా ప్రాణాలు పోతుండేసరికి ఈ గుర్తులతో గాయాలు చేసుకొని చనిపోవడము జరిగినదని ఈ రిపోర్టులు చదువుతున్న త్రివేది గ్రహించాడు.

అంటే ఈయన నిజముగా మణి ప్రాంతమును కనిపెట్టాడని గాకపోతే అది కాస్త   ది బుద్ధ కోడ్ గా మార్చి అర్హత, యోగ్యత ఉన్న వారికి అర్ధమయ్యేవిధముగా అమర్చినాడని త్రివేదికి తెలుసుకోవడానికి అట్టే సమయము పట్టలేదు.ఇంతలో తన టేబుల్ మీద ఉన్న ఫోన్ మ్రోగేసరికి ఎత్తగా చనిపోయిన అంబేద్కర్ శవమును చూడటానికి ఈయన కూతురైన సి.బి.ఐ ఆఫీసర్ అయిన జేసి అలాగే ఈమె బాస్ అయిన కులకర్ణి వస్తున్నారని సమాచారము రావడముతో తన చేతిలో పత్రాలు తీసుకొని త్రివేది కాస్త ఈ శవమున్న మ్యూజియము వైపుకి తన జీపు పోనిచ్చాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి