01భాగం



                                                            THE BURNING MONK




నాంది...

01

 

అది  1963 సంవత్సరం...జూన్ 11

వియత్నాం దేశములో..

బౌద్ధమత సన్యాసుల మీద అకారణముగా ప్రజలు మరియు ప్రజాపతులు విపరీతముగా దాడులు చేస్తున్న విపత్కర సమయములో..

తమ ఉనికిని కాపాడుకోవటానికి దాదాపుగా 1000 మందికి పైగా బౌద్ధమత సన్యాసులు శాంతియుతముగా తమ నిరసనలు గత కొన్ని నెలలుగా తెలుపుతున్నా గూడ ప్రభుత్వములోని చట్టాలలో ఎలాంటి మార్పులు రానందున..

బౌద్ధమతము ఉనికి కాపాడటానికి అలాగే బౌద్ధమత సన్యాసులను హింసించడాన్ని ఆపటానికి తన ఆత్మహత్యయే నాంది అవ్వాలని...

థీచ్ క్వాంగ్ డక్ అను మహాయాన బౌద్ధమత సన్యాసి... సైగాన్ ప్రాంత రహదారి కూడలికి తన కారులో తన స్నేహితులతో కలిసి చేరుకొని అక్కడ రోడ్డు మీద అందరూ చూస్తూండగా...చిరునవ్వుతో పద్మాసనము లో కూర్చుని తన స్నేహితులకి కనుసైగ చెయ్యగా..వారు తాము వచ్చిన కారు దగ్గరికి వెళ్ళి కారులోంచి పెట్రోల్ తీసి..ఇతని మీద దానిని పొయ్యడము ప్రారంభించారు.అసలు అక్కడ ఏమి జరుగుతుందో అక్కడున్నవారు ఉహించేలోపే..ఆ స్నేహితులు తాము తెచ్చిన అగ్గిపెట్టెతో ఈయనకి నిప్పుపెట్టడము క్షణాలలో జరిగిపోయింది. కాని విచిత్రము ఏమిటంటే ఈ 80సం..రాల వయోవృద్ద బౌద్ధ సన్యాసి ఈ దహనాగ్ని తన శరీరమును దహించువేస్తూ.. తన శరీర మాంసమును కాలుస్తున్నగూడ ఏమాత్రము భయపడకుండా.. బాధపడకుండా.. కదలకుండా.. మెదలకుండా.. అరవకుండా..ఎలాగైతే కూర్చున్నాడో అలాగే తన దేహ అస్ధిపంజరము నేలమీద పడిపోయేదాకా నిశ్చలస్ధితిలో ఉండిపోయిన వీడియోను నిర్వాణ లామా తన చెమర్చిన కళ్ళతో  తదేకముగా చూస్తున్నాడు.

ఎందుకంటే తను గూడ ఆత్మహత్య పేరుతో శరీర త్యాగము చేసుకోవాలని గత కొన్ని నెలలుగా తట్టుకోలేని మరణ ఆలోచనలు చేస్తున్నాడు. కారణము తన సాధన పూర్ణస్ధితికి అనగా “ఏమిలేదు..నేను లేను..సర్వం శూన్యం” అనే శూన్యత భావానికి గురి అవుతున్నాడు. అనగా నేనే లేనపుడు కనిపించే ఈ విశ్వము అసత్యమైనపుడు..కనిపించేది అసత్యము..కనిపించని శూన్యము సత్యమైనపుడు..తను ఈ దేహముతో ఉండుట దండగ అని ఈ ఆత్మశూన్యత భావానికి గురి అవుతున్నాడు.

వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది. అదే మనస్సు పగిలితే మిగిలేది నిశ్శబ్ధం. దీనిని తట్టుకోవడము చాలా కష్టమని నిర్వాణ లామా అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడు.దానితో ఈ శూన్యత భావమును ఎలా తట్టుకోవాలో...ఎలా దాటాలో తెలియక..అది ఉన్నదని చెప్పి ఈ స్ధితిని ఎలా దాటాలో చెప్పని శబ్ధపాండిత్యమును తిట్టుకుంటూ..దీనికి  అనుభవపాండిత్య మహాగురువైన భగవాన్ బుద్ద ఏమైనా సందేశమిస్తాడోనని ఆశతో తన చిట్టచివరి ప్రయత్నముగా..తన కెదురుగా ఉన్న

బోధిసత్వులు...అవలోకితేశ్వర మరియు క్షితిగర్భ విగ్రహామూర్తుల కేసి ఆర్తిగా..దీనముగా..శరణాగతితో చూడగా...

తనలో నుండి..తన ప్రమేయము లేకుండా...తన హృదయ పద్మము నుండి

ఓం-మణి-పద్మ-హుం

అను గురుమంత్రము వినపడటము నిర్వాణ లామా గమనించి ఆశ్చర్యానందనమునకు గురి అవుతుండగా….

నాయనా...నువ్వు ఒక సత్యాన్వేషిగా మారి..ఈ శూన్యత భావస్ధితిని నేను ఎలా దాటుకున్నానో ప్రత్యక్షానుభవాలతో తెలుసుకొని...ఈ మంత్ర గూడార్ధమును లోకానికి తెలియచేసి...అందరికి ఎదురయ్యే ఈ స్ధితిని దాటటానికి నేను తెలుసుకున్న మార్గము చెప్పి  తధాగతుడిగా మహా నిర్వాణ నిర్యాణము చెందు” అని అశరీరవాణి సందేశమివ్వడముతో...

ఏ బోధి వృక్షము క్రింద భగవాన్ బుద్ధుడికి జ్ఞానబోధ అయినదో ఆ వృక్షమున్న బుద్ధగయ క్షేత్రానికి నిర్వాణ లామా బయలుదేరాడు.

ఆ తర్వాత ఏమి జరిగినదో..తెలుసుకోవాలంటే మనముగూడ ఈయనను అనుసరించాలి గదా...ఎందుకంటే..

ఆ బుద్ధ నిర్వాణ లామా  ఎవరో తెలుసా..

నువ్వే..                                                                                          

నువ్వే..

నువ్వే..

 

] - Z - U - \

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి