07 భాగం

 

07

నాకు తల్లి ప్రేమ చూపించటానికి మా నాన్నగారు కాస్త మంత్రి గారి సలహామేర మా అమ్మగారి చెల్లాయి అయిన మహా ప్రజాపతిని వివాహము చేసుకొని తన అక్క కొడుకును తన కన్నబిడ్డగా సాకమని అర్థించడముతో... ఈమెకాస్త అందుకు అంగీకరించి ఈ బిడ్డే  తనకి సొంత కొడుకేనని... ఇంక తనకి సంతానమే అవసరము లేదని... కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పతనము లోకానికి తెలియాలి అన్నట్లుగా నన్ను మురిపెంగా... ముద్దుగా... బొద్దుగా పెంచసాగింది. నిజానికి నా వయస్సు పెరిగిన కొద్ది నా కన్నతల్లి గౌతమి కాదన్న విషయమే నాకు తెలియదు.

               నాకు తొమ్మిదేళ్ళ వయస్సులో మా కపిలవస్తు పురములో ఏరువాక పున్నమి గొప్ప మహోత్సవము జరుగుతుంది. ఇందులో మహారాజుగారే స్వయంగా నాగలిపట్టి, నేల దున్ని ఉత్సవం ప్రారంభించడము ఆనవాయితీ. నాకు నాలుగవ యేట నుండి ఇలాంటి ఆడంబరాలు, ఉత్సవాలు, నగలు ధరించడాలు, ఆటల పోటీల్లో పాల్గొనడాలు లాంటి యందు ఆసక్తి లేదు. తల్లిదండ్రుల కోసము ఏదో పాల్గొనాలని పాల్గొనడము తప్ప ఏనాడు మనస్సుపెట్టి పాల్గొనలేదు. కాని నా ఈడువాడు అయిన మా మేనత్త కొడుకు అయిన దేవదత్త నాకు ఈ విషయాల యందు పోటీకి వచ్చి నన్ను ఓడించాలని వాడు ఓడిపోతూ నన్ను ప్రధమ స్థానములో ఉంచి వాడు రెండవ స్థానములో ఎప్పుడు సరిపెట్టు కుంటుంటాడు. నిజానికి వాడిది భుజబలం... నాదేమో బుద్ధి బలము. నాకేమో ఇలాంటి ఉత్సవ విందులు, వినోదాలు ఇష్టము లేకపోవడముతో నేను కాస్త దూరంగా... నిర్జనంగా ఉన్న ఒక తోటలోనికి ధ్యానము కోసము వెళ్తుంటే నా ఈడు వాడే అయిన మా మేనత్త రెండవ కుమారుడైన కాలుదయి నా వెంట వచ్చాడు.

మేమిద్దరము ఒక చెట్టు క్రింద ధ్యానములో కూర్చోబోతుండగా మా అమ్మ మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి "నాయనలారా. అక్కడ ఉత్సవము జరుగుతుంటే మీరిద్దరు ఇక్కడ ఉండి ఏమి చేస్తున్నారు. అక్కడ బ్రాహ్మణుల చేత వేదపఠనము జరుగుతోంది. వింటే పుణ్యం వస్తుంది అన్నది."

దానికి నేను కాస్త "అమ్మా. వేదం వాళ్ళు చదివితే   పుణ్యము వాళ్లకి వస్తుంది కానీ మనకి రాదు కదా. అదే మన తండ్రి గారు చదివితే మనకి పుణ్యం వచ్చేది గదా అన్నాను.

*** *** *** *** *** ***

మ్యూజియము నుండి బయటికి వచ్చిన నిర్వాణలామా అలాగే ఆనందభిక్షువు కలిసి ప్రక్కనే ఉన్న బోధి వృక్షము క్రింద విశ్రాంతిగా కూర్చొనిఉండగా

ఆనందభిక్షువుకి ఒక సందేహము వచ్చి

స్వామి.మీరు వివాహము అయినట్లుగా మీ భార్య ఏదో బాధ అనుభవించినట్లుగా నిన్న చెప్పారు గదా.వాటి వివరాలు..

మిత్రమా.తెలుసుకొని ఏమి చేస్తావు?నాతో బాటుగా నీవు గూడ బాధ పడతావు.అంతేగదా.

స్వామి.ఏదో నాతో చెప్పుకొంటే మీ గుండె బాధ కొంత తీరినట్లే గదా.



మిత్రమా.అయితే విను.నా పూర్వ నామము పవన్ శర్మ.నేను యువ శాస్త్రవేత్తను.సైన్సు ప్రయోగాలు అందులో అంతరిక్ష ప్రయోగాలు అనగా నక్షత్రాలు,గ్రహాల గతులు,బ్లాక్ హోల్స్ మీద వివిధ రకాలుగా ఉండే సిద్ధాంతాలు ఆధారముగా ప్రయోగాలు చేస్తుండేవాడిని.ప్రపంచ సైన్స్ శాస్త్రవేత్తలలో టాప్ 5 లో ఒకడిగా నేను ఉండాలని ప్రతి నిత్యము అనుకొనేవాడిని. 

మా గురువు స్టీఫెన్ హాకింగ్.   ఈయన రచించిన  కాల చరిత్ర  (A Brief History of Time) అను పుస్తకము చదివి ఈయనకి ఏకలవ్య శిష్యుడని అయిపోయాను.ఈయన శరీరము కదలక పోయిన, అంగాలు పనిచేయక పోయిన ఏ మాత్రము నిరుత్సాహము పడకుండా బాధ పడకుండా భూమి నుంచి అంతరిక్షము దాకా ....బిగ్ బాంగ్ థియరి నుంచి బ్లాక్ హోల్ థియరి దాకా ….. సైన్స్ సిద్ధాంతాలు దాటకుండా వాటిని ఒకదానినొకటి అనుసంధానము చేస్తూ తన ఆలోచనలతో ఎన్నో ప్రయోగాలు చేసిన ఉన్నత వ్యక్తి. ఈయన లాగానే నేను గూడ ఏదో క్రొత్త విషయాన్ని లోకానికి తెలియ చేయాలని నా ప్రయోగాలు ఉండాలని పరితపించేవాడిని.దానితో నేను గూడ బ్లాక్ హోల్స్ మీద ప్రయోగాలు చేయడము ప్రారంభించాను.అవి ఒకదానితో మరికటి అనుసంధానమై ఉంటాయా లేదా ఈ బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళితే చివర ఏమి ఉంటుందని నా ఆలోచన ప్రయోగాలు ఉంటుండేవి.కొన్ని సంవత్సరాల ప్రయోగాల తరవాత ఈ బ్లాక్ హోల్స్ చివర మన భూలోకము లాంటి గోళాలు అనుసంధానింపబడి ఉంటాయని, ఒక్కొక్క హొల్ కి ఒక్కొక్క లోకము ఉంటుందని అందులో మనకి లాగానే జీవరాశి ఉంటుందని, మనవి  వాయు శరీరాలు అయితే వారివి కాంతి లేదా జల లేదా సూక్ష్మ లేదా ఆత్మ శరీరాలతో ఆయాలోకవాసులు ఉంటారని ఈ ప్రయోగాలు నిర్ధారణ చేసుకొనే సమయానికి..

నేను కాస్త ప్రయోగాలకే నా జీవితము ఎక్కడ అంకితము అవుతుందనే భయముతో నా తల్లిదండ్రులు నాకు ఏరికోరి ఒక వెటర్నరి డాక్టర్ తో వివాహము జరిపించారు.ఆమె పేరు ప్రకృతి. పేరుకి తగట్లుగా ప్రకృతి ప్రేమికురాలు. పైగా జంతువులంటే చాలా పిచ్చి. కుక్కలుపిల్లులుఆవులు,గేదెలు,పందులు,పక్షులు ఇలా వీటితోనే సహజీవనము చేస్తుండేది. నేను కాస్త ప్రయోగశాలలో ఎక్కువ సమయము గడిపితే ఈమె మాత్రము జంతువుల మధ్య, మొక్కల మధ్య ఎక్కువ సమయము గడుపుతుండేది.దానితో ఈమె మరీ సున్నిత మనస్కురాలైనది. మొక్కలు లేదా జంతువులు తన చేతిలో చనిపోతే ...మనిషి చనిపోతే ఎలాగైతే ఏడుస్తారో అలా ఏడుస్తుండేది.ఆమెను ఓదార్చడము నా వల్ల అయ్యేది కాదు.కొన్ని రోజుల నుండి కొన్ని నెలలు ఈమె కోలుకోవడానికి సమయము పట్టేది.ఈలోపు నా ప్రయోగశాలలో నేను ఉండిపోయేవాడిని.కొన్ని రోజులు ఆమెతో  మాట్లాడటానికి వీలుకానంతగా నా ప్రయోగశాలలో ఉండిపోయేవాడిని.అది నేను  తెలియకుండా చేసిన తప్పుయని నేను తెలుసుకొనేసరికి నా ప్రకృతి నా చేతిలో లేకుండా పోయే పరిస్థితి ఎదురైనది అంటుండగా..

పోలీస్ జీప్ లు విపరీతముగా హారన్ మ్రోగించుకుంటూ ఈ మ్యూజియము దగ్గరికి రావడముతో..వీరిద్దరు తమ సంభాషణను ఆపి ఎవరు వచ్చినారో తెలుసుకోవాలని ఉత్సుకతతో మ్యూజియము వైపుకు వెళ్ళడము జరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి