04 భాగం

 

04

నాకు నామకరణము చేసే ఏర్పాట్లు చేశారు. మా నాన్నగారి రాజ్యమునకు వారసుడు పుట్టాలనే కోరిక సిద్ధించినందుకు నాకు 'సిద్ధార్థుడు' అనే నామము పెట్టడము జరిగింది. ఆ తర్వాత మా నాన్నగారు ప్రముఖ జ్యోతిష్య పండితులను పిలిపించి నా జాతకము గీయించారు. ఇలా వచ్చిన వారంతా నా జాతక చక్ర ఫలితాలను చూసి భయపడి మహారాజు గారికి నిజము చెప్పే ధైర్య సాహసము చెయ్యలేక

ఈ పిల్లవాడు మహా రాజయోగ జాతకము గలవాడు. పైగా మహా చక్రవర్తి లక్షణాలు ఈ జాతకములో కొట్టొచ్చినట్లుగా గ్రహ గతులు చెపుతున్నాయని తప్పుడు జాతక ఫలితాలు చెప్పి దండిగా బహుమానాలు అందుకొని వెళ్లిపోయారు. కాని ఒక యువ జ్యోతిష్యవేత్త  మాత్రము నిజ జాతక ఫలితమును మహారాజుకి చెప్పలేక పోతున్నాననే ఆవేదన ఇతడి ముఖములో కనిపించడము ఎలాంటి జాతక ఫలితము చెప్పకుండా మౌనము వహించడము పైగా ఎలాంటి బహుమతి గూడ తీసుకోకుండా మౌనముగా వెళుతున్న ఆ జ్యోతిష్య పండితుడిని చూసిన మా నాన్నగారికి అంటే ఇప్పుడు దాకా చెప్పిన జాతక ఫలితాలు తప్పుయని అనిపించినది. ఎందుకంటే గతములోనే కొంతమంది జ్యోతిష్య పండితులు మా అమ్మకి వచ్చిన తెల్ల ఏనుగు కల ఆధారముగా వేసిన జాతక ప్రశ్న ప్రకారము పుట్టేవాడు  మహా తపఃశ్శాలి అవుతాడని చెప్పిన విషయము మా నాన్నగారికి గుర్తుకు వచ్చి ఆయన ముఖములో విషాధఛాయలు అలుముకున్నాయి.

    ఇది ఇలా ఉంటే ఈ నామకరణ మహోత్సవము జరిగిన వారం రోజులకి అనుకోని అతిధిగా అసిత మహర్షి మా ఆస్థానానికి రావడము జరిగింది. ఈయన మా రాజ్యములో ఉన్న ఒక పర్వత గుహయందు ధ్యాన నిష్ఠలో ఉంటారని... ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి మాత్రమే... అదిగూడ లోక కళ్యాణ సంఘటనలు జరిగే అవకాశముంటే వాటిని లోకానికి చెప్పటానికి ఈ గుహ దిగి వస్తాడని అందరు అనుకుంటూ ఉంటారు.

ఇలాంటి తపస్వి ఈ రోజు మా ఇంటికి రాగానే...

మా నాన్నగారు ఈయనకు ఎదురు వెళ్లి ప్రణామం చేసి అతిధి సత్కారాలు చేసి... అంతఃపురములో ఉన్న నా దగ్గరికి తీసుకొని వచ్చి ఆశీర్వదించమని అర్ధించాడు. 124 సంవత్సరాల ఈ వయోవృద్ధ తాపసి ఊయలలో ఆడుకుంటున్న నన్ను చాలా నిశిత దృష్టితో గమనించి మౌనం వహించాడు.

కొద్దిసేపు అయిన తర్వాత నేను ఏడ్వటానికి బదులుగా ఈయన ఏడ్వటము మొదలు పెట్టేసరికి అక్కడున్న వారంతా ఈ విపరీత చర్యకి కలవరపడసాగారు. దానితో మా నాన్నగారు ఈయనతో "మహాత్మా. పిల్లవానిలో ఏమైనా దోషం ఉందా? అది మీరు గమనించారా? చెప్పండి. స్వామి. ఈ దోషనివారణకు తగ్గ పరిహారాలు చెప్పితే మా ఆస్థాన పండితుల చేత చేయిస్తాను" అని అనగానే....

     ఈ మహర్షి రోదన ఆపి, వచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ "మహారాజా. ఈ పిల్లవాడిలో ఏలాంటి దోషము లేదు. దోషము అంతా నాలోనే ఉంది. ఎందుకంటే ఈ పిల్లవాడు పెరిగి పెద్దవాడై మహా తపఃశ్శాలి అయ్యి విశ్వరహస్యాలను తన అనుభవ జ్ఞానముతో తెలుసుకొనే మహాజ్ఞాని. అందరి హృదయాలలో కొలువు తీరుతారు. గాకపోతే ఈ కారణ జన్ముడు చెప్పే దివ్య సందేశం వినే అదృష్టం నాకు లేదని బాధపడుతున్నాను. మహారాజా. మీరు అనుకుంటున్నట్లుగా ఈ పిల్లవాడు దేశాలు ఏలే చక్రవర్తి కాలేడు. కానీ జ్ఞానులకే మహాజ్ఞాని, గురువులకే మహాగురువు....యోగులకే మహాయోగి అవ్వక తప్పదు. నా మాట పొల్లుపోదు. ఇది సత్యం. ఇది తధ్యం." అంటూ ఆవేశపూరితముగా మాట్లాడి ఆవేదనతో ఎలా అయితే తుఫానులాగా వచ్చారో... అలా వెళ్లిపోతున్న మహర్షిని మా నాన్నగారు ఆపటానికి ప్రయత్నించినపుడికి ప్రయోజనము లేకపోయింది.

 

*** *** *** *** *** ***





మ్యూజియం లోపల నగ్నముగా ఒక బౌద్ధ మత సన్యాసి నిర్జీవముగా పడి ఉన్నాడు.చేతిలో పద్మాకార తాళం చెవి అలాగే గుండెల మీద ఒక డైమండ్ గుర్తు దాని క్రింద ఒక త్రికోణ గుర్తును గాయముతో గీసుకున్నట్లుగా కనబడుతుంది.పైగా తన రెండు కన్నులలో ఒక కన్ను మాత్రమే తెరిచి చనిపోయాడు.

ఈ శరీర స్థితిని దలైలామాతో పాటుగా అక్కడున్న వారంతా పరిశీలించి విశ్లేషించి బాధతో ఆవేదనతో  దలైలామా వెంటనే అక్కడే ఉన్న తన అనుచరవర్గం వారితో

పోలీసులకు సమాచారము ఇవ్వమని అనుఙ్ఞ ఇవ్వడంతో వాళ్ళు ఈ పనిలో బిజీగా ఉండటము జరిగినది.

దలైలామా మరొక్కసారి ఈ శవమును తేరిపారా చూస్తూ అక్కడున్నవారితో ….

బహుశా ఇతను గూడ శూన్యత భావ స్థితిని తట్టుకోలేక దాని బాధను తన గుండెలమీద ఏదో గుర్తుతో తెలియచేసినారని చెపుతుండగా

ఇది విన్న నిర్వాణలామా మాత్రము తన మనస్సులో ఇది సత్యము గాదని ఈ బౌద్ధ సన్యాసి మరణము ఆత్మహత్య గాదని ఖచ్చితముగా హత్యేనని ఎందుకంటే ఎడమ చేతి బ్రొటనవ్రేలు మాత్రమే లేకపోవడము పైగా 14 వ శతాబ్ధము  నాటి మణియున్న బుద్ధుడి అవతారాల ఫోటోల దగ్గర చనిపోవడము బట్టి చూస్తుంటే మణి రహస్యమును ఇతను తెలుసుకున్నాడని ఇతగాడి శత్రువులెవరో గ్రహించి ఆ మణి రహస్యము కోసము ఇతనిని బాగా వేధించి హింసించి చంపి ఉంటారని తను తెలుసుకున్న ఈ రహస్యమును లోకానికి చెప్పటానికి ఆధారాలుగా తన గుండెలమీద ఉన్న గుర్తులు అలాగే ఎడమ చేతిలోని పద్మాకార తాళం చెవి పెట్టుకొని చనిపోయి ఉంటాడని గ్రహించి ఏమి జరుగుతుందో మౌనముగా సాగాడు.

ఇంతలో..అక్కడికి హడావుడిగా

పోలీసు జీపులు సైరన్లు వేసుకొని రావడము అందులోంచి ఎస్.పి.స్థాయి పోలీసు అధికారి దిగడము ఇతనితో పాటుగా సాయుధ పోలీసులు దిగి ఈ శవమున్న చోటులో ఉన్నవారిని దూరముగా ఉంచి ఈ శవము చుట్టూ కంచెలాగా టేపులు వెయ్యడము ఆ అధికారి లోపలికి వచ్చి ఈ శవమును నిశిత దృష్టితో చూడటము క్షణాలలో జరిగిపోయింది.

అక్కడే ఉన్న దలైలామాను చూస్తూ ఈ అధికారి కాస్త స్వామి. నా పేరు త్రివేది.ఈ ఏరియా ఎస్.పి.ఇది హత్యా లేదా ఆత్మహత్యయా?”

నాయనా.నాకు తెలిసి ఇది ఆత్మహత్యయే.ఎందుకంటే ఇతను ఆరు నెలలనుండి శూన్యత భావ స్థితి ఎలా దాటుకోవాలో తెలియక పలువిధాలుగా ఆత్మహత్య ప్రయత్నము చేసుకోవడము ప్రారంభించాడు.సమయానికి ఇతర భిక్షులు వీడిని రక్షించడము జరిగినది.అది ఈనాడు తీవ్రస్థాయిలోనికి ఈ భావ స్థితిని పొంది ఉండటముతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడు అని అనగానే

అయితే స్వామీజీ.మరి ఈయన గుండెల మీద ఏవో గుర్తులు అలాగే చేతిలో పద్మాకార తాళం చెవి ఉన్నది గదా.ఒక వేళ ఈ గుర్తులు బౌద్ధధర్మ చిహ్నాలా? అనగానే..

నాయనా.ఈ గుర్తులకి బౌద్ధధర్మ చిహ్నాలకి ఎలాంటి సంబంధము లేదు.ఇక తాళము చెవి అంటారా?బహుశా అది అతని గది   తాళం చెవి అయ్యి ఉండవచ్చు అంటూ అక్కడ నుండి దలైలామా కాస్త తన అనుచరగణముతో పోలీసుల కోరిక మేర బయటికి వెళ్ళడము జరిగినది.

అనుమానము తీరని త్రివేది కాస్త..అక్కడున్న ఇతర బౌద్ధ సన్యాసులను ఉద్ధేశించి

మీలో ఎవరైనా ఇతని శరీరము మీద ఉన్న గుర్తులను గూర్చి చెప్పగలరా?” అని అడగగానే..

స్వామి.నేను చెప్పగలను అంటూ నిర్వాణలామా ముందుకి వచ్చేసరికి

స్వామి.మీరు ఎవరని?” అడగగానే



స్వామి.నా పేరు నిర్వాణలామా. దలైలామా ప్రసంగము వినడానికి నేను టిబెట్ నుండి రావడము జరిగినది.ఇతని దేహము మీద ఉన్న రెండు గుర్తులలో డైమండ్ గుర్తు ఒక మణికి సంకేతము అయితే త్రికోణ గుర్తు అయితే పంచకోణ నక్షత్రములోని ఒక కోణ సూచన అని నాకు అనిపిస్తోంది.

అయితే స్వామి వీటికి బౌద్ధధర్మానికి ఏమిటి సంబంధము?” అనగానే..

స్వామి.ఈ గుర్తులను బట్టి చూస్తుంటే బుద్ధుడి అత్యంత విలువైన మణి రహస్యమును ఈయన తెలుసుకొని ఉండి ఉండాలి.ఎందుకంటే ఈ గదిలో మణియున్న బుద్ధుడి ఫోటోల మధ్యనే ఈయన చనిపోవడము జరిగినది.పైగా ఈయన చేతిలో అంతే విచిత్రముగా పద్మాకార తాళం చెవి ఉన్నదని అనగానే..

అపుడుగాని త్రివేది గది పరిసరాలను చూసి అవును.ఇతను చెప్పినది నిజమే అనుకుంటూ

స్వామి.మీ దృష్టిలో ఇది హత్య లేదా ఆత్మహత్యా?” అనగానే

స్వామి.ముమ్మాటికి ఇది హత్యయే.ఎందుకంటే శవము యొక్క ఎడమ చేతికి ఉన్న బొటనవ్రేలును కత్తిరించి తీసుకొని వెళ్ళినట్టుగా ఉందిఅనగానే..

ఆ విషయము ఇంతసేపటివరకు తను ఎందుకు గమనించలేదో అని తిట్టుకొంటూ త్రివేది కాస్త తన మనస్సులో కొంపతీసి వీడు సన్యాసి వేషములో ఉన్న సి.బి.ఐ ఆఫీసర్ గాదుగదా అనుకుంటుండగా

త్రివేది మనస్సు గ్రహించిన నిర్వాణలామా కాస్త వెంటనే

స్వామి.మనస్సు పెట్టి చూస్తే అన్ని రహస్యాలు అర్ధమౌతాయి. దానికి సి.బి.ఐ ఆఫీసర్ కానవసరము లేదు అనగానే త్రివేది ముఖము మాడ్చుకొని ప్రక్కకు తిరిగాడు.

వీరిద్దరి సంభాషణలు ఎంతో శ్రద్ధా భక్తులతో వింటున్న ఆనందభిక్షువుకి నిర్వాణలామా చెప్పిన విశ్లేషణ బాగా నచ్చి తను ఎన్నాళ్ళనుంచో నిజ ఙ్ఞాన గురువు కోసము ఎదురు చూస్తున్నాడు.అది ఈనాడు నిర్వాణలామా రూపములో తీరబోతున్నదని గ్రహించి..

స్వామి.నిర్వాణలామా గారు.నా పేరు ఆనందభిక్షువు.ఈ రోజు నుండి మీరే నాకు ఙ్ఞాన గురువులు.నాకు కావలసిన ఙ్ఞాన బోధను అందించగలరు.

స్వామి.మీరెవరో నాకు తెలియదు.ఇక్కడ ఎవరికి వారే గురువులు.ప్రత్యేకముగా గురువులుగా ఉండవల్సిన అవసరమే లేదు.ఎందుకంటే ఎవరికివారే స్వయముగా ఙ్ఞానమును సంపాదించుకోవాలని మన బుద్ధ భగవానుడి ఉవాచగదా.

అది నిజమే స్వామి. కాని మాలాంటి వాళ్ళు ఈ చనిపోయిన సన్యాసి లాగా శూన్యతభావ స్థితివద్ద ఆగిపోతే..

మిత్రమా.యోగముంటే యోగి గాక తప్పదు.ఏది ఎపుడు ఎలా ఇవ్వాలో మన ప్రకృతి మాతకి బాగా తెలుసు. అదిగూడ ఎంతవరకు ఇవ్వాలో గూడ తెలుసు.మనము భరించలేని దానిని అది ఏనాడు మనకు ఇవ్వదు.

ఇది నిజమే గావచ్చును.కాని మీలాంటి వాళ్ళ సహచర్యము వలన మాలాంటి వారికి సత్ ప్రవర్తన కలుగుతుంది కదా.ఎటూ నన్ను మీరు మిత్రమా అని అన్నారు గదా.”ఈనాటి నుండి గురు మిత్ర అనుబంధము మన మధ్య ఉంటుంది.అవును కాని స్వామి.శూన్యత భావ స్థితిని తట్టుకోవడము అంత కష్టమా?”

మిత్రమా.

వస్తువు పగిలితే శబ్దం వస్తుంది.

అదే మనస్సు పగిలితే మిగిలేది నిశ్శబ్దము.

దానిని తట్టుకోవడము చాలా చాలా కష్టము. నా భార్య పొందిన శూన్యత భావ స్థితి నుండి పడిన కష్టము తెలుసు కనుక చెప్పగలుగుతున్నాను. అలాగే నేను పొందిన శూన్యత భావ స్థితి నుంచి ఈ స్థితి గురించి చెప్పగలుగుతున్నాను అంటూ గది నుండి బయటకు వెళ్ళుతుండేసరికి ఆనందభిక్షువు కాస్త ఆనందముతో అనుసరించాడు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి